Drugs Mafia: డ్రగ్స్, గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. కాలేజీలు, యూనివర్శిటీల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు.. డ్రగ్స్, గంజాయి బారిన పడి.. బంగారు భవిష్యత్తును చేజేతులా కాలరాసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రయివేట్ మెడికల్ కాలేజీలు, యూనివర్శిటీల్లోకి సైతం డ్రగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో మత్తుకు బానిసవుతున్న యువత జీవితాలు.. పెడదారి పడుతున్నాయని క్లియర్‌గా అర్ధమవుతోంది.
విశ్వనగరంగా పేరు పొందిన హైదరాబాద్‌లో డ్రగ్స్, గంజాయి సరఫరా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పెడ్లర్లు, స్మగ్లర్లు.. పోలీసుల కళ్లుగప్పి తమ వినియోగదారులకు మత్తు పదార్థాలు అందిస్తూనే ఉన్నారు. కానీ ఈ డ్రగ్స్ దందా ఇప్పుడు మెడికల్ కాలేజీలు, యూనివర్శిటీల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే సంపన్న బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహేంద్ర నిర్వహిస్తున్న మహేంద్ర యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయితో పట్టుపడ్డారు. వారిని ఈగల్ టీం పట్టుకుంది. 50 మందికి పైగా విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని తెలిసింది. ఇందులో చాలామంది టాపర్స్ కూడా ఉన్నారని ఈగల్ టీం వెల్లడించింది. మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన నలుగురు విద్యార్థులు గంజాయి తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే గంజాయి ఎక్కడినుంచి ఎలా వస్తుందని దానిపైన విచారణ జరిపితే అధికారులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
Fake Liquor Labels: మీరు తాగుతున్న మద్యం క్వాలిటీనేనా? అసలు మ్యాటరేంటంటే?
అస్సాంకు చెందిన నేవల్ల అనే యువకుడు ఈ గంజాయితోపాటు అత్యంత కిక్కు ఇచ్చే ఓజీ ఖుషి గంజాయిని కూడా తీసుకువస్తున్నాడని తేలింది. నేవల్ల ఢిల్లీలోని కొంతమందితో పరిచయాలు పెంచుకొని కొరియర్ల ద్వారా గంజాయిని హైదరాబాద్ తెప్పిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా జిప్ లాక్ పాలిథిన్ కవర్లలో డ్రగ్స్ తెప్పిస్తున్నాడు. జీడిమెట్ల, కూకట్‌పల్లి, బాచుపల్లిలో ఉన్న కొంతమంది యువకులతో కలిపి నేవల్ల ఒక ముఠా తయారు చేసుకున్నాడు. ఆ ముఠా విద్యార్థులను ట్రాప్ చేస్తుంది. ఇందులో మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులను కూడా కలుపుకున్నాడు. వారితో కలిపి తన బిజినెస్‌ని నడిపించుకుంటున్నాడు. ఢిల్లీకి చెందిన అనిల్ జావేదుల ద్వారా గంజాయితోపాటు ఓజీ ఖుషి గంజాయిని తెప్పిస్తున్నాడు.
గంజాయిని సిగరెట్ల రూపంలో మారుస్తున్నాడు నేవల్ల. ఒక్కొక్క సిగరెట్ ని రూ.2500కు అమ్ముతున్నాడు. బల్క్‌గా అయితే డబ్బు తక్కువగా తీసుకుంటున్నాడు. దీంతో విద్యార్థులు పెద్ద మొత్తంలో సిగరెట్లు కొనుగోలు చేసుకుని తాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో పాకెట్ మనీ ఇస్తుండడంతో..దానిని వీళ్లు ఈ మత్తు కోసం వినియోగిస్తున్నారు. ఇందులో చాలా మంది రెగ్యులర్ కస్టమర్లుగా మారారని పోలీసులు తెలిపారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు.
Crime Love: ప్రేమించుకున్న ఇద్దరు అబ్బాయిలు.. భార్యాభర్తల్లా కలిసిందామనుకొని చివరకు?
మరోవైపు కొండాపూర్ రేవ్ పార్టీలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన క్లౌడ్ కిచెన్ యజమాని తేజతో పాటు జోన్నాడకు చెందిన వ్యాపారవేత్త విక్రమ్, హైదరాబాద్‌కు చెందిన నీలిమ, బెంగుళూరుకు చెందిన చందన్, కొండాపూర్‌కు చెందిన వైన్‌షాప్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, శేరిలింగంపల్లికి చెందిన భార్గవ్ ఉన్నారు.
క్లౌడ్ కిచెన్ యజమాని తేజ రేవ్‌పార్టీని అరెంజ్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. తేజ, విక్రమ్, నీలిమలు ముగ్గురు రాజమండ్రికి చెందిన వారు. ఈ ముగ్గురికి కొకైన్ సేవించడం అలవాటు ఉంది. బెంగుళూరుకు వెళ్లిన సమయంలో రాహూల్ అనే కొకైన్ పెడ్లర్, క్లౌడ్ కిచెన్ యజమాని తేజకు పరిచయమయ్యాడు. అప్పటి నుండి రాహూల్ దగ్గర కొకైన్ కొనుగోలు చేయడం ఆ తరువాత తేజ, విక్రమ్, నీలిమ కలిసి రాజమండ్రిలో డ్రగ్స్ ను సేవించేవారు. ఈ క్రమంలో తమ ప్రొఫెషనల్‌లో భాగంగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్ను అద్దెకు తీసుకున్నారు. ముగ్గురు కలిసి నిత్యం ఈ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ సేవించేవారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో అరెస్టు అయిన విక్రమ్, మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్ కేసు నిందితుడు విక్రమ్‌కు స్నేహితుడు. గతేడాది జనవరి 1న విక్రమ్, చిస్టీలను డిచ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రాహూల్ పరారీలో ఉన్నాడు. మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్ కేసులో రాహూల్ అరెస్టు అయ్యాడు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ చాలా కీలకమని పోలీసులు గుర్తించారు. మణిదీప్.. రేవ్ పార్టీలు నిర్వహించే వాడని, తేజ, విక్రమ్, నీలిమ అనేక సార్లు రాజమండ్రిలో నిర్వహించే ఆ రేవ్‌పార్టీలకు అటెండ్ అయినట్లు గా పోలీసులు గుర్తించారు. ఒకవైపు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులో ఉంటూనే.. మరోవైపు ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని రేవ్‌పార్టీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం మణిదీప్ పరారీలో ఉన్నాడు.
మరోవైపు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. చెన్నై కస్టమ్స్ అధికారులు, నార్కోటిక్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించడంతో డ్రగ్స్ గుట్టు రట్టయింది. 2 కేజీల కొకైన్‌ను సీజ్ చేశారు. ట్రాలీ బ్యాగ్‌తో నైజీరియాకు చెందిన ఓ మహిళ చెన్నై విమానాశ్రయంలో దిగింది. కొకైన్ అని తెలియనీయకుండా నల్లటి టేప్ చుట్టి ట్రాలీ బ్యాగ్ అడుగుభాగంలో దాచి పెట్టింది. కానీ సీక్రెట్ ప్లేస్ లో దాచిన కొకైన్‌ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. నైజీరియన్ మహిళపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.