Hyderabad: హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను భర్తే బండరాయితో పలుమార్లు కొట్టి హత్యకు యత్నించిన ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్ (32), షబానా పర్వీన్ (22) దంపతులు హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భిణి. మార్చి 29న ఆమె అస్వస్థతకు గురికావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం ఏప్రిల్ 1న రాత్రి ఆమెను డిశ్చార్జ్ చేశారు.
Read Also: Maheshwaram: మహేశ్వరంలో సంచలనం.. యాక్సిడెంట్ ముసుగులో హత్య
అలా ఆసుపత్రి బయటకు వచ్చిన వెంటనే బస్రత్, షబానా మధ్య గొడవ మొదలైంది. ఈ వాగ్వాదం క్రమంగా పెరిగి రోడ్డుమీదే ఘర్షణగా మారింది. ఈ క్రమంలో కింద పడిన షబానాపై బస్రత్ మానవత్వం మరిచి బండరాయితో దాడి చేశాడు. ఏకంగా 10 నుంచి 12 సార్లు రాయితో తలపై, శరీరంపై మోదడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ దాడిలో చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ సంఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానితో గచ్చిబౌలి పోలీసులు గాయపడ్డ షబానాను తక్షణమే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ ఆసుపత్రిలో కోమా పరిస్థితిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి నిందితుడు బస్రత్‌ను ఏప్రిల్ 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది