Twitter : కొంతకాలంగా ట్విటర్ సంస్థలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న భయాందోళనలో నెట్టుకొస్తున్నారు. ఇదంతా ఎందుకు.. ఇక ఏదైతే అదైందని మూకుమ్మడి రాజీనామాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ చిక్కిన తర్వాత సంస్థలో సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తామన్న ప్రకటన యూజర్లను అయోమయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ ఉద్యోగులు కొందరు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సంస్థకు గుడ్‌బై చెప్పాలని వందలాదిమంది నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ గంటలు పనిచేయాలని, లేదంటే సంస్థను వదిలివెళ్లాలంటూ మస్క్ అల్టిమేటం నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also: Alien Birth: బీహార్లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
ఇటీవల వర్క్ ప్లేస్ యాప్ ‘బ్లైండ్’ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 180 మంది ఉద్యోగులను ప్రశ్నించగా 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడగా 7 శాతం మంది సంస్థను అంటిపెట్టుకుని ఉండేందుకు ఓటు వేశారు. సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరిని కలిసిన మస్క్ వారిని సంస్థలో ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. కంపెనీని అంటిపెట్టుకుని ఉండేది ఎందరన్న విషయంలో స్పష్టత లేదు.. తొందరపడి ఉద్యోగులను తొలగించాలనుకోవడం, ఎక్కువ పనిగంటలు పనిచేసేలా ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో కంపెనీలో కొనసాగేందుకు ఎక్కుమంది సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. ఉద్యోగులు పెద్దమొత్తంలో రాజీనామాలు చేసి కంపెనీని వీడాలనుకుంటున్నట్టు వార్తలు రావడంతో సోమవారం వరకు ఆఫీసులను మూసి బ్యాడ్జ్ యాక్సెస్ తగ్గించనున్నట్టు కంపెనీ నుంచి ఉద్యోగులకు సమాచారం అందింనట్లు తెలిసింది.