సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తారన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది అని హోంమంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్‌లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది.
సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్‌ను హోంమంత్రి అనిత పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను హోంమంత్రికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. ప్రమాదం జరిగిన రూంలో ఫైర్ అలారం సిస్టం లేకపోవడం పట్ల హోం మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలోని అన్ని బ్లాక్‌లలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అగ్ని ప్రమాదాల విషయంలో ఏ మేరకు సురక్షితమో రిపోర్టు ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉండే కీలక బ్లాకుల్లో ఈ ప్రమాదం జరగడం పట్ల హోంమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ‘సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఫోరెనిక్స్ నిపుణులు పరిశీలించి ఆధారాలు సేకరిస్తారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం. సచివాలయంలో ఫైర్ సేఫ్టీ అడిట్ నిర్వహిస్తాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని హోంమంత్రి తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఇప్పటికే సచివాలయంకు చేరుకుంది.