రక్షించాల్సిన పోలీసులే.. భక్షకులుగా మారుతున్నారు. కన్ను మిన్ను కానకుండా స్త్రీలపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. బైక్‌పై వెళ్తున్న ఓ జంటను పోలీస్ వాహనంలో తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఓ హోంగార్డ్ అడ్డగించి, బెదిరించి మహిళను తుప్పల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి కుమిలి వెళ్లే రహదారిలో బైక్‌పై తన కుటుంబసభ్యుడితో కలిసి వెళ్తున్న సుమారు 45 ఏళ్ల వయసు కలిగిన మహిళను చూసిన హోంగార్డ్, అతని స్నేహితుడు పోలీస్ వాహనంపై వాని వెనుక వెళ్లి కుమిలి వెళ్లే రహదారిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం వద్ద బైక్‌ను ఆపారు.
అనంతరం బైక్‌పై ఉన్న వ్యక్తిని హోంగార్డ్ బెది రించి, అక్కడే తన స్నేహితుడిని ఉంచి, మహిళను సమీప పొదల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుతో దిశ పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే లైంగికదాడికి పాల్పడిన హోంగార్డ్ ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని దిశ సీఐ నాగేశ్వరరావు తెలిపారు.