BLN Reddy: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో విచారణకు హాజరు కానున్నారు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి. ఈడీ ముందు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో HMDA చీఫ్ ఇంజనీర్‌గా పదేళ్ల పాటు పని చేసిన ఆయన, ఈ కేసులో A3గా ఉన్నారు. ఈ రేస్ కేసులో ముఖ్యాంశంగా నిధుల బదిలీపై ఈడీ దృష్టి సారించింది. HMDA నుంచి నిధులు ఎలా..? ఎందుకు..? బదిలీ అయ్యాయి అనే విషయంలో బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రెండు ఇన్వాయిస్ల ప్రకారం మొత్తం రూ. 45 కోట్లకు పైగా చెల్లింపులకు సంబంధించిన ఆదేశాలు ఎవరు ఇచ్చారనే అంశం విచారణకు రాబోతున్నట్లు సమాచారం.
Also Read: Adilabad: ప్రభుత్వ వసతి గృహంలో మందు బాబుల వీరంగం.. విద్యార్థులతో ఘర్షణ
ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి మొదటి ఒప్పందం పురపాలక శాఖ, ఎస్-Next Gen కంపెనీ, FEO మధ్య జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒప్పందాల నేపథ్యంలో HMDA నిధుల వాడకంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరో కీలక వ్యక్తి అయిన అర్వింద్ కుమార్‌ను రేపు విచారించనున్నారు. రేస్ నిర్వహణలో జరిగిన ఆర్థిక సంబంధిత వ్యవహారాలపై ఆయన నుంచి కూడా సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. HMDA నుంచి నిధులు బదిలీకి కారణం ఏమిటి?, మొదటి ఇన్వాయిస్ ప్రకారం రూ. 22,69,63,125 చెల్లింపులు ఎలా జరిగాయి?, రెండో ఇన్వాయిస్ ప్రకారం రూ. 23,01,97,500 చెల్లింపులకు ఆదేశాలు ఎవరు జారీ చేశారు? మొత్తం నిధుల సరఫరాలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయా? ఈ ప్రశ్నలపై బీఎల్‌ఎన్ రెడ్డికి ఈడీ సుదీర్ఘ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కేసు పరిణామాలు త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.