Floods Effect in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మధ్యంతర సహాయంగా కేంద్రం నుండి రూ. 2,000 కోట్లు కోరారు. రాష్ట్రంలోని వరద బాధితులకు నష్టపరిహారాన్ని పెంచడానికి రిలీఫ్ మాన్యువల్‌ను మారుస్తామని చెప్పారు. గత వారంలో భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రోడ్లు మూసుకుపోవడంతో పాటు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్లు, రూ. 2,000 కోట్ల మధ్యంతర ఉపశమనం కోసం అభ్యర్థించినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారం చెప్పారు. రాష్ట్రం రూ.4,000 కోట్ల నష్టాన్ని చవిచూసిందని, అంచనాలు కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష పరిహారం ఇస్తామని ప్రకటించిన సీఎం సుఖు, పరిహారాన్ని పెంచేందుకు రిలీఫ్ మాన్యువల్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. మాన్యువల్ ప్రకారం, ప్రతి విపత్తు బాధితుడికి ప్రస్తుతం రూ.5,000 సహాయంగా మంజూరు చేయబడింది.
Also Read: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. జ్యుడీషియల్ కస్టడీకి ముగ్గురు రైల్వే అధికారులు
ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశామని, తన ప్రభుత్వంలోని మంత్రులందరూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధితుల సహాయార్థం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అసోసియేషన్లు, హిమాచల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు, ఇతరులు కూడా ఈ నిధికి ఒక రోజు వేతనాన్ని అందించాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. తాము బీజేపీ ఎమ్మెల్యేలను అదే విధంగా చేయమని అభ్యర్థించినట్లు చెప్పారు. సాధారణ ప్రజలకు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రెస్క్యూ, తరలింపు, పునరుద్ధరణ అనే మూడు పాయింట్ల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది. 75,000 మంది పర్యాటకుల్లో 67,000 మందిని రక్షించామని, అందులో 250 మంది లాహౌల్, స్పితి, చంద్రతాల్‌లలో చిక్కుకున్నారని, ఇప్పుడు మౌలిక సదుపాయాల పునరుద్ధరణపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి చెప్పారు. కొంతమంది పర్యాటకులు ఇప్పటికీ కసోల్, తీర్థన్ లోయలో ఉన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని, వారికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు.గడిచిన 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు విడుదల చేసిందని, ఇందులో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు రూ. 610 కోట్లు, జలశక్తి శాఖకు రూ.218 కోట్లు, రాష్ట్ర విపత్తు సహాయ నిధికి రూ.180 కోట్లు ఉన్నాయని తెలిపారు.
Also Read: Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు
కేంద్రం నుంచి అందుతున్న రూ.180 కోట్లు వర్షాకాలంలో రాష్ట్రానికి అందించిన వార్షిక సాయమని, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఆర్థిక సహాయం అందలేదని సుఖూ స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 26న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 108 మంది మరణించగా, 12 మంది గల్లంతయ్యారు. రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రకారం, 667 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1,264 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మండి, సిమ్లా జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు సహా గత 24 గంటల్లో 17 మంది మరణించారు. మరణాల గణనలో రోడ్డు ప్రమాదాలు, వర్షాలకు సంబంధించిన సంఘటనలలో మరణించిన వారు ఉన్నారు. రాష్ట్రంలో 860కి పైగా రోడ్లు ఇప్పటికీ మూసుకుపోయాయి. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ 994 రూట్లలో ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. చిక్కుకుపోయిన వ్యక్తులను గుర్తించడానికి పోలీసు బృందాలు ఇప్పుడు దృష్టి సారిస్తున్నాయి.
Also Read: iPhone 14 Price Drop: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర!
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలు, కొండచరియల కారణంగా రోడ్లు మూసుకుపోయిన కఠినమైన అంతర్గత ప్రాంతాలకు పోలీసు బృందాలు తరలిస్తున్నాయని తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సత్వాంత్ అత్వాల్ తెలిపారు. కసోల్, మణికరణ్ పరిసర ప్రాంతాలలో చిక్కుకుపోయిన అనేక మంది పర్యాటకులు తమ వాహనాలు లేకుండా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. పరిస్థితి సాధారణమయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. పర్యాటకులు తమ వాహనాలను తీసుకొని రోడ్లు తిరిగి తెరవబడే వరకు వేచి ఉండేందుకు ఇష్టపడతారని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. జులై 18 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం ‘ఎల్లో’ హెచ్చరికను జారీ చేసింది.