విశాఖ గీతం వర్సిటీ మెడికల్ కాలేజీ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ ఋషికొండలోని గీతం మెడికల్ కాలేజ్ ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ,పోలీసు యంత్రంగం రంగంలోకి దిగాయి. మెడికల్ కాలేజ్ వైపు రహదారుల ను మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. డీసీపీ సుమీత్ గరుడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గతంలో తొలగించగా….ఇప్పుడు ఆ భూముల్లో ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 45 ఎకరాలు మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగిందని గతంలోనే రెవెన్యూ శాఖ తేల్చింది. గీతం యూనివర్సిటీ చైర్మన్ గా టీడీపీ నేత, బాల కృష్ణ అల్లుడు శ్రీభరత్ వ్యవహరిస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం గీతం భూముల్లోకి వచ్చిందనేది టీడీపీ ఆరోపణ. ఈ నేపథ్యంలో మీడియా సహా బయట వ్యక్తులు ఎవరు యూనివర్సిటీ వైపు వెళ్ల కుండా నియంత్రిస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే… రూరల్ ఎమ్మర్వో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఆక్రమణలకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నాం అన్నారు. అప్పుడు బోర్డులు మాత్రమే పెట్టాము. మరల ఆక్రమణ కు గురికాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు పెన్సింగ్ వేసాం. సర్వే నెంబర్ 37,38 లో 14 ఎకరాలు ప్రభుత్వ భూమి మెడికల్ కళాశాల వద్ద ఉంది. అందులో గీతం ప్రాంగణంలో ఉన్న 5.72 ఎకరాలకు ఫెన్సింగ్ వేశామన్నారు. కోర్టు పరిధిలో 40 ఎకరాల వరకు ఉంది అందులో మేము జోక్యం చేసుకోలేదన్నారు.