కేటీఆర్‌కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టేయాలని కోరుతూ.. కేటీఆర్ కోర్టు గుమ్మం తొక్కిన విషయంతెలిసిందే. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేసింది. కోర్టు తీర్పులో ఏసీబీ దూకుడు పెంచింది. విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రికి సూచించింది.
అసలు ఏంటి ఈ కేసు?
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఫిబ్రవరి 11, 2023 లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు చెందిన రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ ట్రాక్ పై దూసుకెళుతూ హైదరబాదీలను అలరించాయి. ఈ రేసు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ టికెట్లను బుక్ మై షో ద్వారా అమ్మారు. సామాన్య ప్రజలు టికెట్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఇలా హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈ కారు రేసును నిర్వహించారు. ఈ రేసుకు అనుమతి నుంచి ఏర్పాట్ల వరకు అంతా కేటీఆర్ చూశారు. అందులో భారీ అవినీతి జరిగిందనేది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వాదన.
ఎఫ్ఈవో రూ.55 కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏ ..
2023 ఆరంభంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్ కావడంతో 2024 లో కూడా దీన్ని నిర్వహించేందుకు గత ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్టోబర్ 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవో కు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని ఆరోపించింది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బీఐ నిబంధనలు పాటించలేరని తమ విచారణలో తేలినట్లు చెబుతోంది. గవర్నర్ అనుమతి తీసుకుని మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. 2024 లో మరోసారి ఫార్ములా ఈ రేసు నిర్వహించేందుకు ముందస్తుగా ఇచ్చిన రూ.55 కోట్లపై ఏసీబీ విచారణ చేపట్టింది.
దూకుడు పెంచిన ఏసీబీ..
ఈ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని… ఇందులో కేటీఆర్ కీలక పాత్ర పోషించాడని ఏసీబీ అనుమానించింది. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1, ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డి ని ఏ3 గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, నమోదు చేసిన కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టేశారు. ప్రస్తుతం కేసును అటు ఏసీబీ ఇటు ఈడీ రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా దూకుడు పెంచిన ఏసీబీ విచారణకు రావాలని మాజీ మంత్రిని కోరింది. దీంతో మాజీ మంత్రి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టుకు చేరుకున్నా్రు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఏసీబీని సూచించింది. తాజాగా తుది తీర్పు వెలువడింది. ఇప్పుడు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వేచి చూడాలి?
READ MORE: Vizag Railway Zone: దశాబ్దాల పోరాటం, నిరీక్షణకు తెర… రేపే ప్రధాని మోడీ శ్రీకారం..