నేడు అందాలరాశి త్రిషకు నాలుగు పదులు నిండుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. నలభై ఏళ్ళలోనూ అయస్కాంతంలా ఆకర్షించే అందం సొంతం చేసుకున్న త్రిషను చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూనే ఉన్నారు. అదీ విశేషం! ఆరంభంలో కుర్ర హీరోలతోనే నటిస్తానని మడి కట్టుకున్న త్రిష తరువాత తత్వం బోధపడి అగ్రకథానాయకులతోనూ నటించేసింది. ఆ తీరున టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, రవితేజ, గోపీచంద్ సరసన నటించి మురిపించింది త్రిష. మణిరత్నం మేగ్నమ్ ఒపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాల్లోనూ త్రిష తన అందంతో కనువిందు చేసింది. అందులో తన కంటే పది సంవత్సరాలు వయసులో పెద్దదైన ఐశ్వర్యారాయ్ బచ్చన్ ముందు త్రిష అందం ఓ వెలుగు వెలిగిందనే చెప్పాలి. ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాల్లోనూ త్రిష భలేగా మురిపించారు.
Also Read : Bichagadu2 : ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉన్నాయి.. నో టెన్షన్
త్రిష 1983 మే 4న చెన్నైలో జన్మించారు. చెన్నైలోని చర్చి పార్క్ ఏరియాలో ఉన్న శాక్రిడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో త్రిష ప్లస్ టూ దాకా చదివారు. యతిరాజ్ కాలేజ్ ఫర్ విమెన్ లో బీబీఏ పూర్తి చేశారు త్రిష. 1999లో ‘మిస్ సేలమ్’గానూ, అదే యేడాది ‘మిస్ మద్రాస్’గానూ ఎంపికైన త్రిష తరువాత 2001లో ‘మిస్ ఇండియా’ పోటీలో ‘బ్యూటిఫుల్ స్మైల్’ అవార్డు సొంతం చేసుకున్నారు. 1999లో ‘జోడి’ సినిమాలో సిమ్రన్ స్నేహితురాలిగా తెరపై తొలిసారి త్రిష తళుక్కుమన్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన త్రిష, ఆ తరువాత ‘వర్షం’తో భలేగా మురిపించారు. ఆ పై తెలుగు చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగారామె.
Also Read : Cyclone Mocha: రాష్ట్రానికి ముంచుకొస్తున్న ‘మోచా’ తుపాను ముప్పు.. ఆందోళనలో రైతులు
తరువాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ మరింతగా కవ్వించింది. ఇంకేముంది? ఎంతోమంది రసికాగ్రేసరులు త్రిషను తమ కలలరాణిగా పట్టాభిషేకం చేసుకొని ఆనందించారు. త్రిష సినిమా అంటే చాలు అది ఎలాగున్నా, చూసేసి అందులోని ఆమె అందాల విందును కనులారా లాగించేసి మైమరచిపోయేవారు.
Also Read : Bommireddy Raghavendra Reddy: నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్..! వైసీపీలో చేరనున్న సీనియర్ నేత..
తెలుగులో ఈ మధ్య త్రిష కనిపించడం తగ్గింది. కానీ, ఆమె నటించిన తమిళ చిత్రాలను సైతం చూసి ఆనందిస్తున్నారు తెలుగుజనం. ఆ మధ్య వచ్చిన తమిళ చిత్రం ’96’ అక్కడ మంచి విజయం సాధించింది. లాక్ డౌన్ సమయంలో తెలుగువారు ఈ తమిళ చిత్రాన్నే చూసి భలేగా ఆనందించారు. దీని రీమేక్ గా తెలుగులో వచ్చిన ‘జానూ’ మన జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనిని బట్టే త్రిష కాసింత అందంగా కనిపిస్తే చాలు కనువిందు చేస్తుందనే నమ్మకంతో ఎంతోమంది తెలుగువారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే త్రిషకు తగ్గ కథలేవీ తెలుగులో లభించడం లేదు. దాంతో ఆమె అనువాద చిత్రాలతోనే సంతృప్తి చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. త్రిష తెలుగు చిత్రంలో నటించి ఇప్పటికి ఏడేళ్ళయింది. తనకు తగ్గ పాత్ర లభిస్తే ఎంచక్కా నటించేస్తా అంటున్నారామె. మూడు తమిళ చిత్రాలలోనూ, ఓ మళయాళ సినిమాలోనూ నటిస్తూ ఇప్పటికీ బిజీగా సాగుతున్న త్రిష, ఏ రోజున తెలుగు అభిమానులకు ఆనందం పంచుతారో చూడాలి.