Heeraben Modi: ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం శివైక్యం చెందారు. అస్వస్థతతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అనంతరం గాంధీనగర్‌లోని ముక్తిధామ్ శ్మశానవాటికిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ మోదీ చితికి నిప్పంటించి ప్రధాని మోదీ అక్కడి నుంచి వెనుదిరిగారు. హిరాబెన్ అంతిమయాత్రకు కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గాంధీనగర్‌లోని నివాసంలో తన తల్లి పార్ధీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు మోదీ. కడసారి నివాళులు అర్పించారు.
Heeraben Modi: మోడీ తల్లి హీరాబెన్ మృతికి పలువురి సంతాపం
ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు. తల్లి మృతితో ప్రధాని మోదీ భావోధ్వేగపూరిత ట్వీట్ చేశారు.. ‘నిండు నూరేండ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుని పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది. ఆమెలో తాను ఎప్పుడూ త్రిమూర్తులను చూశాను. ఆమె ఒక నిస్వార్ధ కర్మయోగి. విలువలకు నిలువెత్తు నిదర్శనం’ అని చెప్పారు.