గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు మురుగు నీటితో నిండాయి. పలు బస్తీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లు చెరువులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో వర్షం విరుచుకుపడటంతో జన జీవనం స్తంభించింది.
ఎల్బీనగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్.. నారాయణగూడ నుంచి రాష్ట్ర సచివాలయం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరద నీటితో రహదారులు వాగుల్లా మారాయి. వాహనాల రాకపోకలు గంటలతరబడి నిలిచిపోయాయి. ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్‌సుఖ్‌నగర్, రామ్‌నగర్‌లలో పలుచోట్ల చెట్లు కూలాయి. కొన్ని చోట్ల కార్లపై పడగా.. లోపల ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెట్ల కొమ్మలు విరిగి పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. మలక్‌పేట్ ఆర్‌యూబీ నడుములోతు నీటితో నిండింది. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి.
నగరంలో వర్షంధాటికి చరిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. నాలుగేళ్ల కిందట మరమ్మతులు చేపట్టిన ప్రాంతంలోనే మళ్లీ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
గాల్లో కలిసిన ప్రాణాలు…
భారీ వర్షాల ధాటికి పలువులు మృత్యువాత పడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లెలో పొలంలో పనిచేస్తున్న గాజుల వీరమ్మ (60), సుంకరి సైదమ్మ (45)లు పిడుగుపాటుకు మృతి చెందారు. మరొకరు గాయాలపాలయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ చిన్నవెంకటేశ్వర్లు (41) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు మృతి చెందారు. ఇదే జిల్లాలోని వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామానికి చెందిన మహేంద్ర (19) పశువులను తోలుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గోడకూలి ప్రైవేటు ఎలక్ట్రీషియన్ ఇమ్మత్‌ఖాన్(50) మృతి చెందారు. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం భీభత్సానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.