కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శబరిమల పుణ్యక్షేత్రం, అయ్యప్ప జన్మస్థలమైన పందళం, అచ్చన్‌కోవిల్ వంటి ముఖ్యమైన సందర్శక ప్రదేశాలున్న పతనంతిట్ట జిల్లాతోపాటు.. దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఇడుక్కి జిల్లా, అటు తమిళనాడులోని త్రిషూర్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. పంపానదిపై ఉన్న కక్కి డ్యామ్ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో నీటిని కిందకు వదలాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల పంపాబేస్ వద్ద నది ఉప్పొంగనుంది.
డ్యామ్ తెరిస్తే శబరి కొండకు చేరుకునే మూడు బ్రిడ్జిలు మూసుకుపోతాయి. కేరళలోని నదులపై ఉన్న 81 డ్యామ్‌లలో, 10 రెడ్ అలర్ట్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు ఇప్పటివరకూ 41 మందికి పైగా మరణించారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. మరోవైపు పలు జిల్లాల్లో ఆర్మీ, NDRF దళాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారు.మణిమాల నది పరీవాహక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో మొత్తం 62 ఇళ్లు ధ్వంసమయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు.
ఈ నెల 12 నుంచి కేరళలో మొత్తం 24 చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయని, 38 మంది మరణించినట్లు చెప్పారు.రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి 19వ తేదీ మధ్యలో సాధారణం కంటే 135 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏటా ఈ తేదీల మధ్యలో 192.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.. కానీ ఈసారి ఏకంగా 453.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా అళప్పుజ, త్రిస్సూర్ మినహాయించి మిగతా అన్నీ జిల్లాల్లో ఇప్పటికే 100 శాతం వర్షపాతం నమోదయింది. అత్యధికంగా కోలికోడ్‌లో 223 శాతం అధికంగా కురిసింది.