తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సాయంత్రం కుండపోత వర్షం కురుస్తోంది. నిమిషాల వ్యవధిలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా అంబర్‌పేట్- మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైదబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. గండిపేట చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు.
ఇక మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది.
రాష్ట్రంలో కురుస్తున్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి వాగులో గేదెలు కొట్టుపోయాయి. సిరిసిల్లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. పాత బస్టాండులోని వాహనాలు నీటమునిగాయి. అటు సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టింది.
భారీ వర్షానికి వాగులు అలుగుపారాయి. సింగూరు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు మంచి నీటి చెరువు అలుగు పడింది. నీరు ఉదృతంగా ప్రహించడంతో ఇల్లందు- సత్యనారాయణ పురం మధ్య రాకపోకలు నిలిచిపొయ్యాయి. ఏపీలోను పలు చోట్ల భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణశాఖ. దీని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని చెప్పింది. నేటి నుంచి ఈనెల 11 వరకు తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు.