కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు.
READ MORE: Student Teacher Romantic Video: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ స్టెప్పులు..
కాగా.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 7.6. కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని వాతావరణ శాఖ అధికారులు గతంలో తెలిపారు. ఆ తర్వాత ఈశాన్య, వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్‌గా మారి ఈనెల 25వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని కొన్ని మోడళ్లు, బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళుతుందని మరికొన్ని మోడళ్ల ఆధారంగా అంచనా వేశారు. ఈనెల 24వ తేదీ తరువాత ఏర్పడనున్న తుఫాన్‌కు ఒమన్ దేశం సూచించిన ‘రీమల్’ (ఆర్‌ఈఎంఏఎల్) అని పేరు పెట్టనున్నారు. కాగా, గడచిన మూడు రోజులుగా వాయువ్య భారతంలో తీవ్ర వడగాడ్పులు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతోంది.