దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.
మార్చి 23 నుంచి 26 మధ్య అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, జార్ఖండ్, కేరళలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా లక్షద్వీప్, కోస్తా కర్ణాటక. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షపాతంతో పాటు ఉరుములకు అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. చేతికొచ్చిన పంటలు వర్షం పాలయ్యాయి. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అన్నదాతలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు.