మాండూస్ తుఫాన్ దెబ్బ ఏపీని వణికిస్తోంది. తుఫాన్ కారణంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో విస్తారంగా వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షం కుండపోతగా పడుతూ వుండడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు తిరుమలలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ తడిసి ముద్దయ్యి పలు చోట్ల నీరు ఏరులై పారుతూ వుంది. రోడ్లపై వ్యాపారం సాగించేవారు దుకాణాలను మూసివేశారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకుంటున్న భక్తులు వర్షానికి ఇబ్బందులకు గురౌతున్నారు. శ్రీవారి భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ అనుమతి ఇచ్చింది. ఒకవైపు వర్షంతో అటునుంచి వెళ్ళే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
Read Also: IND Vs BAN: ఇషాన్ డబుల్ సెంచరీ.. కోహ్లీ సెంచరీ.. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్
గదులు పొందిన భక్తులు వర్షానికి గదుల నుంచి బయటకు రాలేక గదులకే పరిమితమవ్వుతున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్ లకు చేరుకునేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గొడుగులతో కొంతమంది భక్తులు..వర్షంలో తడూస్తూనే మరికొంత మంది భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లకు చేరుకుంటున్నారు. ఇక స్వామి వారి దర్శనం ముగించుకొని ఆలయం వెలుపలకి వస్తున్న భక్తులు వర్షానికి పరుగులు తీస్తుండగా..మరి కొంత మంది భక్తులు షెడ్ల క్రింద తలదాచుకుంటున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలో వాతావరణం పూర్తిగా మారిపోయి చలిగాలులు వీస్తున్నాయి. వర్షం నేపధ్యంలో అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా పాపవినాశనం,శ్రీవారి పాదాల రహదారులను మూసివేసి..భక్తులు రాకపోకలను నిలిపివేసింది. ఇక ఘూట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడే అవకాశం వున్న నేపధ్యంలో టీటీడి ఇంజనీరింగ్,అటవీ,విజిలెన్స్ సిబ్బందితో టీటీడి అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి జెసిబిలను అందుబాటులో వుంచింది. కొండచరియులు,చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేశారు. ఆగకుండా వర్షం కురుస్తూ వుండడంతో టోల్ గేట్ల వద్ద భద్రతా సిబ్బంది ఘూట్ రోడ్లలో వాహనచోదకులు నిదానంగా వెళ్ళాలంటూ భక్తులకు సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా మాండూస్ తుఫాన్ ఏడుకొండలకు వచ్చిన భక్తులు అష్టకష్టాలు కలిగిస్తోంది.
Read Also: Ranbir Kapoor : గడ్డం కొంపముంచింది.. కెరీర్లోనే భారీ డిజాస్టర్ అందుకున్న టాప్ హీరో