బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాన్ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. తుపాన్ పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ.. క్రమంగా బలహీన పడనుంది. తుపాన్ ప్రభావంతో ఈరోజు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుఫాన్ వల్ల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వరి పంటకు చెందిన నారు మడులు నీట మునిగాయి. ప్రధానంగా కొడవలూరు, విడవలూరు, అల్లూరు, బోగోలు, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటాచలం, మనుబోలు మండలాల్లోని పంట నష్ట ప్రభావం అధికంగా ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల పొలాల పైకి నీరు చేరుతోంది.
Also Read: Egg Price Hike: కూరగాయలు మాత్రమే కాదు.. కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది! చుక్కలు చూస్తున్న సామాన్యులు
ఫెంగల్ తుపాన్ ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. కెరటాల ఉధృతికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు కోతకి గురైంది. మాయ పట్నం, అమీనాబాద్, సూరాడపేట, జగ్గరాజుపేట, కొత్తపట్నం, సుబ్బంపేటలలో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మత్స్యకారుల బోట్లు తీరంలోనే ఉన్నాయి. అలల తాకిడికి చెల్లాచెదురు అయిన తీర ప్రాంతంకి జియో ట్యూబు రాళ్లు రక్షణగా వేశారు.