హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఫిలింనగర్‌లో ప్రాంతాలలో వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి – భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్‌లలో వచ్చే 2 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:MLA Madhavi: ఎమ్మెల్యే మాధవికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆలయంలో పూజలు!
ఉత్తరం, పశ్చిమం, మధ్య హైదరాబాద్‌లో సెర్లింగంపల్లి, కూకట్‌పల్లి, షేక్‌పేట్, ఖైరతాబాద్, టోలీచౌకి కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మెహదీపట్నం, చార్మినార్, నాంపల్లి వైపు దక్షిణ హైదరాబాద్‌ను కవర్ చేస్తాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.