Heavy Rains: ఎండల నుంచి ఉపశమనం లభిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు..
రేపు పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇక, ఎల్లుండి శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి.. మరోవైపు.. శుక్రవారం అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
మరోవైపు.. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 66.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ప్రకాశం జిల్లా కొండపిలో 64 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో 58.5 మి.మీ, గుంటూరు జిల్లా కొల్లిపర 49.5, మంగళగిరిలో 64 మి.మీ వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.. ఇక, భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్ అంబేద్కర్.