ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆప్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి విజయం సాధించిందని కేజ్రీవాల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో నిరసన చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. సెంట్రల్ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఆందోళనల్లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పాల్గొనే చాన్స్ ఉంది.
Read Also: IND vs ENG: విశాఖ టెస్ట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! రజత్ పటీదార్ అరంగేట్రం
ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆప్ నిరసనలను అడ్డుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. ఇక, బీజేపీ ప్రదాన కార్యాలయం, డీడీయూ మార్గ్, ఐటీవో ఏరియాను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇక, ఆప్ పార్టీ ఆఫీసు ఎదుట కూడా ఆందోళనకు దిగుతామని బీజేపీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆప్ కార్యాలయం దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్ ద్వారా వెళ్లే వెహికిల్స్ ను మళ్లీస్తున్నాట్లు పేర్కొన్నారు.