Baby Selling Case: ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ మహిళ మధ్యవర్తులను ఆశ్రయించింది. ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ యువతికి పుట్టిన బాలుడిని మధ్యవర్తులు కరీంనగర్‌కు చెందిన దంపతులకు ఆరు లక్షలకు విక్రయించారు. బాలుడు విక్రయం సంగతి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది. బాలుడిని విక్రయించిన కొనుగోలు చేసిన వారితో పాటు బాలుడిని విక్రయించడానికి మధ్యవర్తులుగా ఉన్న 12 మందిపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్.. అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన యువతి.. ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది. గర్భవతి అయిన ఆ యువతిని సదరు యువకుడు వదిలేసి వెళ్లిపోయాడు. పుట్టబోయే బిడ్డని ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది మధ్య వ్యక్తులను ఆశ్రయించింది. పుట్టబోయే శిశువుని విక్రయించాలని ఆ యువతిని ఒప్పించారు మధ్యవర్తులు.. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో వారం రోజుల కిందట ఓ బాలుడికి జన్మనిచ్చింది. 12 మంది మధ్యవర్తుల ద్వారా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెకు చెందిన భామండ్ల రాయమల్లు లత దంపతులకు బాలుడి కొనుగోలుకు ఆరు లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. గురువారం కరీంనగర్‌లోని సాయిబాబా దేవాలయం సమీపంలోని ప్రవేట్ ఆసుపత్రి వద్ద బాలుడిని కొనుగోలు చేస్తున్నట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో విచారణ చేపట్టి శుక్రవారం బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. బాలుడి కొనుగోలు విక్రయించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 12 మంది ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని మాతా శిశు కేంద్రం కు తరలించారు. బాలల పరిరక్షణ ప్రొటెక్షన్ అధికారి జోగు తిరుపతి ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి తెలిపారు.