HCU Land Issue: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన TGIIC (Telangana State Industrial Infrastructure Corporation) ఇచ్చిన ప్రకటనను ఖండించింది. HCU తెలిపిన ప్రకారం, 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి సర్వే నిర్వహించలేదని వెల్లడించింది. జూలై 2024లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సర్వే జరిగిందన్న వార్తలను HCU ఖండించింది. విశ్వవిద్యాలయం ప్రకటనలో, ఇప్పటివరకు భూమి స్థలాకృతిపై ప్రాథమిక తనిఖీ మాత్రమే జరిగిందని స్పష్టం చేసింది.
TGIIC ఇటీవల HCU భూమి సరిహద్దులు నిర్ణయించబడ్డాయి అని ప్రకటించగా, HCU మాత్రం దీనిని ఖండించింది. తమ భూసరిహద్దులు ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదని, విశ్వవిద్యాలయానికి ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదని HCU ప్రకటించింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని ఎటువంటి అన్యాక్రాంతాలకు గురిచేయకుండా చూడాలని కోరింది. HCU ప్రకారం, ఈ భూమి ట్రాన్స్‌ఫర్ కావాలంటే, అది పూర్తిగా విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి ఆమోదంతో మాత్రమే జరగాలి. HCU ఈ వివాదాన్ని పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ కోణంలో కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.