HCA Scam: HCA కేసులో అరెస్ట్ ఐన ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న CID అధికారులు.. మొదటిరోజు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. మరోవైపు HCA విషయమై అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తోపాటు మరికొందరిపై CID, ED కి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ పరిణామాలు చూస్తుంటే.. HCA కేసులో మరికొన్ని అరెస్ట్ లు తప్పేలా లేవు. ఈ కేసు పోలీసుల మెడకు కూడా చుట్టుకుని.. ఓ ఇన్స్పెకర్ పై వేటు కూడా పడింది.
HCA స్కాంలో అరెస్ట్ ఐన ఐదుగురు నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో… మొదటిరోజు కస్టడీలోకి విచారించింది CID. ఉదయం చర్లపల్లి జైలు నుంచి నలుగురు, చంచల్ గూడ జైలు నుంచి మరొక నిందితురాలిని కస్టడీలోకి తీసుకున్నారు CID అధికారులు. HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతోపాటు.. ట్రెజరర్ శ్రీనివాస రావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్ లను మొదటిరోజు 5 గంటలపాటు ప్రశ్నించారు అధికారులు. నిందితుల న్యాయవాదుల సమక్షంలోనే విచారించారు అధికారులు.
Rk Roja: రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
క్రికెట్ తో సంబంధంలేని జగన్మోహన్ రావు.. HCA లోకి ఎలా ఎంటర్ అయ్యాడు…? శ్రీచక్ర క్లబ్ ను ఎలా సృష్టించారు…? ఎవరెవరి సంతకాలు ఫోర్జరీ చేశారు…? ఈ ప్లాన్ వెనక ఎవరున్నారు…? అనే విషయాలపై ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును ప్రశ్నించారు CID అధికారులు. జగన్మోహన్ రావు కి సహకరించిన కవిత, రాజేందర్ యాదవ్ ను కూడా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అంశాలపైనే ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మౌనంగా ఉండటమే కాకుండా… అంతా మా న్యాయవాది చెప్తారు అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా.. న్యాయవాది చెప్తారు అనే జగన్ ఆన్సర్ చేసినట్లు సమాచారం.
HCA లో జరిగిన అక్రమాలు, నిధుల గోల్ మాల్, నిధుల దారి మళ్లింపు పై సీఈఓ సునీల్ కాంటే, ట్రెజరర్ శ్రీనివాసరావు ను ప్రశ్నించారు CID అధికారులు. అంతా ప్రెసిడెంట్, సెక్రటరీ ఆదేశాలతోనే చేశామని ఈ ఇద్దరూ సమాధానం ఇచ్చారు. ఐతే ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మౌనం వీడటం లేదు.. !! సెక్రెటరీ దేవరాజ్ పరారీలో ఉన్నాడు. దేవరాజ్ పట్టుబడితే కానీ.. నిందితులు నోరు విప్పేలా లేరు. దేవరాజ్ ను ఇప్పటికే ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.
టికెట్ల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ను వేధించిన విషయమై కూడా ప్రెసిడెంట్ ను ప్రశ్నించారు CID అధికారులు. అవకాశం ఉంటేనే మరో 10 శాతం టికెట్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాను తప్ప వేధించలేదని ప్రెసిడెంట్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. విధించినట్లు ఆధారాలు ముందుంచేసరికి… మళ్ళీ మౌనం వహిస్తున్నట్లు సమాచారం. HCA కేసు.. పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి పై వేటు వేశారు రాచకొండ సీపీ. CID అధికారులు అరెస్ట్ చేయబోతున్నారు అనే సమాచారాన్ని సెక్రెటరీ దేవరాజ్ కి ఇన్స్పెక్టర్ దేవరాజ్ లీక్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ఎలక్షన్ రెడ్డి అలెర్ట్ చేయబట్టే.. దేవరాజ్ పరార్ అయినట్లు ఆధారాలు సేకరించి వేటు వేశారు. Cp ఆఫీస్ కి ఎటాచ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి CID ని ఆశ్రయించింది. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పై ఫిర్యాదు చేసింది TCA. ప్రస్తుతం అరెస్ట్ ఐన నిందితుల వెంట ఉండి చక్రం తిప్పిన అసలు దొంగలు తప్పించుకు తిరుగుతున్నారని.. వారిపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. వంకా ప్రతాప్, జాన్ మనోజ్, అర్షద్ ఆయూబ్, సురేందర్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్ లపై కూడా ఫిర్యాదు చేశారు. HCA లో కోట్ల రూపాయల దుర్వినియోగం తోపాటు.. మనీ ల్యాండరింగ్ జరిగిందని ED కి కూడా ఫిర్యాదు చేశారు TCA సెక్రటరీ గురువా రెడ్డి, ప్రెసిడెంట్ యెండల లక్ష్మీనారాయణ. ఇప్పటికే ED కూడా CID కి లేఖ రాసింది. HCA కేసులో పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని CID ని కోరింది ED. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. HCA కేసులో మరిన్ని అరెస్ట్ లు జరిగేలా ఉన్నాయి. కస్టడీ లో ఉన్న నిందితులు నోరు విప్పితే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.