Haryana: హర్యానా కొత్త ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. నూతన సీఎం అభ్యర్థిగా హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయబ్ సింగ్ సైకి బాధ్యతలను అప్పగించింది. ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు పదవికి రాజీనామా చేశారు. ఇక, హర్యానా కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు నయాబ్ సింగ్ సైనీ. మనోహర్‌లాల్ ఖట్టర్ రాజీనామాతో… నయాబ్‌ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. నయాబ్‌సింగ్ సైనీ ప్రస్తుతం కురుక్షేత్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ఆయన…క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందారు. 1996 నుంచి అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారాయన. మండలస్థాయి నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావడంలోనూ కీలక పాత్ర షించారు నయాబ్ సింగ్. మనోహర్‌లాల్‌కు సన్నిహితుడిగా మెలిగిన ఆయన…గతేడాది అక్టోబర్‌లో బీజేపీ హర్యానా బాధ్యతలు చేపట్టారు.
2002లో యూత్ వింగ్ జిల్లా జనరల్ సెక్రటరీగా, 2005లో అంబాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. నయాబ్ సింగ్ సైనీ పనితీరును గుర్తించిన హైకమాండ్… 2009లో బీజేపీ కిసాన్ మోర్చ హర్యానా అధ్యక్షుడిగా నియమించింది. ఇక 2014లో నారాయణగఢ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో మంత్రిగా ప్రమోషన్ దక్కింది. 2019లో పార్టీ సూచనల మేరకు లోక్‌సభకు పోటీ చేశారు. కురుక్షేత్ర నుంచి ఎంపీగా గెలిచారు నయాబ్ సింగ్ సైనీ. మనోహర్‌లాల్ ఖట్టర్ పట్టుబట్టి హర్యానా పార్టీ బాధ్యతలను నయాబ్‌సింగ్ సైనీకి అప్పగించారు.