Harish Rao : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటైన విమర్శలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై ఆంక్షలు విధించడం అత్యంత దిక్కుమాలిన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ప్రస్తుత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఎరువుల ధరలు పెరగడం ఒకవైపు, యూరియా సరఫరా నిలిపివేయడం మరోవైపు రైతులను తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు ఈ సరఫరా నిలిపివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ‘రైతు డిక్లరేషన్’ పేరిట అనేక హామీలను ఇచ్చిందని, అయితే వాటిని నెరవేర్చడంలో ఇప్పుడు పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రైతుబంధు, పంటలకు బోనస్ చెల్లింపు, రుణమాఫీ, పంట భీమా వంటి కీలకమైన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలను తీర్చాల్సింది పోయి, సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
యూరియా కొరతను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, రైతులకు యూరియా వినియోగం తగ్గించాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. ఇటువంటి వింత సూచనలు చేయడం మానేసి, ప్రభుత్వం తక్షణమే ఈ అనాధికారిక నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మునుపటిలాగే ఎటువంటి ఆంక్షలు లేకుండా యూరియా అమ్మకాలను కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
