విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు హరీశ్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి వేతనాలు లేవని, కేవలం తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామన్నారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి రోజూ ఇంటింటికీ తాగునీరు అందివ్వలేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప అని ఆయన తెలిపారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మిషన్ భగీరథకు బహుమతి అందించిందని, మన రాష్ట్రంలో 12శాతం బడ్జెట్ ను విద్య రంగం పై పెట్టడం గర్వ కారణమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వము కాపీ కొట్టి అమలు చేస్తున్నదని, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపిలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు అందించాలని అసెంబ్లీలలో అడుగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 30 వేల కోట్లు బకాయిలు ఇవ్వడం లేదని, ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈహెచ్ఎస్ పథకం అమలు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు.