అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. 4 ఫోర్లు, 5 సిక్సులతో హార్దిక్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సులు బాది ఈ రికార్డును అందుకున్నాడు.
ఈ జాబితాలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది వాంఖడేలో ఇంగ్లండ్‌పై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 18 ఫిఫ్టీ కొట్టాడు. 2022లో గౌహతిలో దక్షిణాఫ్రికాపై సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ పేరుపై ఉంది. 2023 ఆసియా క్రీడలలో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో 50 పరుగులు చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు.
భారత్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు:
12 – యువరాజ్ సింగ్ vs ఇంగ్లండ్, డర్బన్, 2007 ప్రపంచకప్
16 – హార్దిక్ పాండ్యా vs దక్షిణాఫ్రికా, అహ్మదాబాద్, 2025
17 – అభిషేక్ శర్మ vs ఇంగ్లండ్, వాంఖడే, 2025
18 – KL రాహుల్ vs స్కాట్లాండ్, దుబాయ్, 2021
18 – సూర్యకుమార్ యాదవ్ vs దక్షిణాఫ్రికా, గౌహతి, 2022