MI Captain Hardik Pandya React on Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మతో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. సారథ్యం విషయంలో తనకు రోహిత్ సాయం చేస్తాడని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని పేర్కొన్నాడు. ముంబై సాదించిందంతా రోహిత్ సారథ్యంలోనే అని, దాన్ని తాను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024 మినీ వేలం అనంతరం రోహిత్ స్థానంలో హార్దిక్ ముంబై సారథిగా ఎంపికయిన విషయం తెలిసిందే. జట్టు భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై మేనేజ్మెంట్ చెప్పింది.
సోమవారం రోహిత్ శర్మ గురించి హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ లేనంత మాత్రాన ఏమీ మారదు. రోహిత్ ఎప్పుడూ నాకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు.ముంబై ఏదైతే సాధించిందో.. అదంతా రోహిత్ భాయ్ సారథ్యంలోనే దక్కింది. నేను దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. నా భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని నేను అనుకుంటున్నాను. మేం అభిమానులను గౌరవిస్తాం కానీ జట్టుకు ఏది అవసరమనేదానిపై దృష్టి పెడతాం. నా చేతుల్లో ఉన్న దానిపైనే ధ్యాస ఉంటుంది. అభిమానులు ఎప్పుడూ సరిగ్గానే ఉంటారు. వారి అభిప్రాయాలను కూడా గౌరవిస్తా’ అని హార్దిక్ తెలిపాడు.
Also Read: Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024కు సిద్ధమవుతున్నాడు. హార్దిక్ గాయంపై మాట్లాడుతూ… ‘ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. ఐపీఎల్ 2024లో అన్ని మ్యాచ్‌లూ ఆడేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. బౌలింగ్ కూడా చేస్తాను. ముంబై ఇండియన్స్‌పై ఎప్పుడూ అంచనాలు ఉంటాయి. ఓ జట్టుగా మేమెలా సన్నద్ధమయ్యామనేది తెలియాలంటే.. రెండు నెలలు ఆగాల్సిందే. మంచి ఆటతీరు ప్రదర్శిస్తాం. అందరూ ఆస్వాదించేలా చేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు.