ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి తన పెళ్లి పత్రికలో బీజేపీకి ఓటు వేయండి అని ముద్రించిన వెడ్డింగ్ కార్డుతో వరుడు ఇబ్బందుల్లో పడ్డాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి ఫిక్స్ అయింది.. అయితే తనకు ప్రధాని మోడీ అంటే చాలా ఇష్టం ఉండటంతో తన పెళ్లి కార్డుపై ఆయన పేరును ముద్రించాడు. అంతేకాకుండా మా జంటకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి.. మోడీకి ఓటు వేసి మళ్లీ ప్రధానిగా చేయాలంటూ ఆ పెళ్లి కార్డులో ప్రింట్ చేయించాడు. అయితే, ఇదే ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ వరుడి బంధువు దగ్గరకు ఈ పెళ్లి పత్రిక చేరగా.. ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధమంటూ ఏకంగా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: KCR Bus Yatra: నేడు ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ బస్సుయాత్ర..
ఇక, వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం పుత్తూరు తాలుకాలో ఉన్న ఆ పెళ్లి కుమారుడి ఇంటికి ఈ నెల 14వ తేదీన వెళ్లారు. అయితే తాను పెళ్లి పత్రికలు ముద్రించే సమయానికి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాలేదని పేర్కొన్నాడు. తాను మార్చి 1వ తేదీనే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేద్ర మోడీపై అభిమానం, దేశం పట్ల బాధ్యతతోనే.. మోడీకి ఓటు వేయాలని రాయించినట్లు పెళ్లికొడుకు చెప్పుకొచ్చాడు. ఇక, ఆ వరుడు చెప్పిన విషయాలను అంగీకరించని ఎలక్షన్ కమిషన్ అధికారులు.. ఈ నెల 26వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈనెల 18న ఆ వ్యక్తికి పెళ్లి జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. వరుడితో పాటు ఆ పెళ్లి పత్రికలు ముద్రించిన ప్రెస్ యజమానిపైనా కూడా తగిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.