‘వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..’ ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని మద్రక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లుడు తన పెళ్లికి ముందే తన కాబోయే అత్తగారితో పారిపోయాడు. ఈ సంఘటన మొత్తం గ్రామంలో సంచలనం సృష్టించింది.
అలీఘర్‌లోని మద్రక్ ప్రాంతంలోని ఒక గ్రామంలో నివసిస్తున్న వ్యక్తి కుమార్తె వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. బంధువులను ఆహ్వానించారు. కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. అంతలోనే కాబోయే అల్లుడు అత్తతో కలిసి జంప్ అయ్యాడు. తన భార్య బంధువుల వద్దకు వెళ్లి ఉండవచ్చని బాధితుడు అనుకున్నాడు. కానీ కూతురికి కాబోయే వరుడు కూడా కనిపించకుండా పోవడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం తమ అమ్మాయితో ఓ అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి తల్లి తన కాబోయే అల్లుడికి స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది. తన కూతురిని వివాహం చేసుకోబోయే అబ్బాయి కాబోయే భార్యతో కాకుండా అత్తతో గంటల తరబడి ఫోన్ మాట్లాడేవాడు. వాస్తవానికి.. ఆ అబ్బాయికి కాబోయే మావయ్య వృత్తిరీత్యా పేరే ప్రాంతానికి వెళ్లాడు. మూడు నెలల తర్వాత తాను గ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పుడు తన భార్య కాబోయే అల్లుడితో ఎక్కువగా మాట్లాడుతుందని గ్రహించాడు. అయినా.. బాధితుడు ఎక్కువగా పట్టించుకోలేదు. పెళ్లి పనుల్లో బిజీగా మారాడు.
ఈ నేపథ్యంలో కాబోయే అల్లుడితో ఆ అత్త ప్రేమలో పడింది. అత్త ఇంట్లో ఉన్న రూ.3.5 లక్షల నగదు, దాదాపు రూ.5 లక్షల విలువైన ఆభరణాలను తీసుకుని అల్లుడితో కలిసి పారిపోయింది. ‘వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..’ అని ఓ లెటర్‌లో రాశారు. దీంతో బాధితుడు ఏం చేయాలో తెలియక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.