Minister Nara Lokesh: రాష్ట్రంలోని పాఠశాలల్లో కొత్తగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,762 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి పలు వినతిపత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని 32,818 పాఠశాలల్ల్లో తరగతి గదుల మరమ్మతులు, టాయ్ లెట్లు, తాగునీటి వసతులకు రూ.4,141 కోట్లు, 7579 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.2621 కోట్లు అవరమని, మొత్తంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 6,762 కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020 విజయవంతంగా అమలు చేస్తున్న ఏపీకి పీఎంశ్రీ పథకం 3వవిడతలో 1514 స్కూళ్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.
Read Also: Minister Nara Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి మంత్రి నారా లోకేష్
మొత్తం 2,369 పాఠశాలలకు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించగా, పిఎం శ్రీ మొదటి, రెండువిడతల్లో 855 పాఠశాలలు మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు. తక్షణమే కొత్త స్కూల్లను మంజూరుచేసి పేదలకు నాణ్యమైన విద్యను అందించడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.100 కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైబ్రరీ రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణాకు పరిమితమైందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ లో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎపి మినహా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలన్నీ ఐకానిక్ భవనాలతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీలను కలిగి ఉన్నాయని తెలిపారు. మంత్రి లోకేష్ వినతులపై కేంద్రమంత్రి జయంత్ చౌదరి సానుకూలంగా స్పందిస్తూ… ఎపిలో స్కూళ్ల అభివృద్ధికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.