Govt Shuffles Cabinet: కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజును గురువారం తొలగించారు. ప్రస్తుత కేబినెట్‌లో కిరణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు అతని ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలకు అదనంగా న్యాయ మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యతలు అప్పగించబడ్డాయి. కిరెన్ రిజిజు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తారు. ఈ ఆకస్మిక మార్పును రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా.. అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు న్యాయశాఖ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
Read Also: Pakistan: పాక్‌లో ప్రెసిడెంట్, ప్రధాని కంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే ఎక్కువ వేతనం
కాగా న్యాయశాఖ మంత్రిగా రిజిజును తొలగించడంపై శివసేన స్పందించింది. శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎవరి పేర్లనూ తీసుకోకుండా, ఈ రోజు ట్విట్టర్‌లో ఇలా అన్నారు, “ఇది మహారాష్ట్ర తీర్పు ఇబ్బంది కారణంగానా? లేదా మోదానీ-సెబీ దర్యాప్తు కారణంగానా?” అంటూ ప్రశ్నించారు.