సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
2023 డిసెంబర్‌లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31 వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం తదుపరి నోటీసు వచ్చే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎగుమతి ఆంక్షలు అమలులోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పైగా తగ్గాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చినా ఎగుమతులు నిషేదించడం సమంజసం కాదని వెల్లడించారు.
బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉల్లి కోసం భారతదేశంపై ఆధారపడి ఉంటాయి. భారత్ ఉల్లి ఎగుమతులను నిషేధించడం వల్ల ఆ దేశాల్లో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆసియా దేశాల మొత్తం ఉల్లిపాయల దిగుమతుల్లో సగానికి పైగా వాటా భారతదేశానిదే. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసినట్లు సమాచారం.
ఇటీవలే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు రావాలని ప్రధాని మోడీ ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగితే.. ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. అందుకే ఉల్లి ధరలు పెరగకుండా కట్టడికి ఎగుమతులను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అది కాకుండా రికార్డ్ స్థాయిలో మూడోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రూ.2 తగ్గించారు. ఇవన్నీ ఎన్నికల కోసమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.