అక్టోబర్ 17న రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఇంట్రాడేలో 6.3 శాతం భారీ క్షీణత తర్వాత బుధవారం బంగారం ఔన్సుకు 2.9 శాతం తగ్గి.. 4,004 డాలర్లకు చేరుకుంది. ఇది 12 సంవత్సరాలలో అతిపెద్ద తగ్గుదల అనే చెప్పాలి. వెండి కూడా ఇంట్రాడేలో 7.1 శాతం పడిపోయింది కానీ.. తరువాత దాదాపు 2 శాతం కోలుకుని 47.6 డాలర్ల వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆకస్మిక తగ్గుదల లాభాల స్వీకరణను సూచిస్తుంది.
కేసీఎం ట్రేడ్‌లో చీఫ్ మార్కెట్ నిపుణుడు టిమ్ వాటరర్ బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ… ‘లాభాల స్వీకరణ వేగంగా పెరుగుతోండి. బంగారం మార్కెట్లో ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో లాభాలను నమోదు చేసుకోవడానికి వ్యాపారులకు ఇది మంచి అవకాశంగా చూస్తున్నారు. అందుకే ఈ తగ్గుదల ప్రబలంగా మారింది’ అని చెప్పారు. నేడు భారత మార్కెట్లో బంగారం తగ్గుదల ప్రభావం కనిపించలేదు. ఎందుకంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) దీపావళి, బలిప్రతిపాద సెలవుదినం కారణంగా మార్కెట్ ఈరోజు మూసివేయబడింది. రేపు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గవచ్చు. అయితే తగ్గుదల ఎంత ఉంటుందో చెప్పడం మాత్రం కష్టం.
ప్రస్తుతం MCXలో డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,28,000 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది మునుపటి ముగింపు కంటే రూ.271 లేదా 0.21 శాతం తగ్గింది. వెండి ఫ్యూచర్స్ రూ.327 లేదా 0.22 శాతం తగ్గి.. కిలోకు రూ.1,50,000 వద్ద ట్రేడవుతున్నాయి. రికార్డు గరిష్ట స్థాయి కంటే వెండి రూ.20,000 తక్కువగా ఉంది. బంగారం దాని రికార్డు గరిష్ట స్థాయి కంటే రూ.4,000 తక్కువగా ఉంది. వ్యాపారులు స్థూల ఆర్థిక సంకేతాలపై ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన నవీకరణలపై దృష్టి పెట్టడం వల్ల ఈ తగ్గుదల జరిగిందని నిపుణులు అంటున్నారు.
Also Read: Sarfaraz Khan: ముస్లిం కాబట్టే సర్ఫరాజ్‌కు నో ప్లేస్.. గంభీర్‌పై కాంగ్రెస్ నాయకురాలు ఫైర్!
ఈ వారం సోమవారం బంగారం ఔన్సుకు $4,381 వద్ద కొత్త రికార్డు గరిష్టాన్ని తాకింది. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సహా వడ్డీ రేటు కోతల అంచనాల కారణంగా బంగారం ఈ సంవత్సరం దాదాపు 56 శాతం పెరిగింది. కానీ ఇప్పుడు వ్యాపారులు యూఎస్ ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానంపై దృష్టి సారించి కొంత లాభాలను బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుత దిద్దుబాటు తాత్కాలికమేనని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం షట్‌డౌన్ కొనసాగుతున్నందున అమెరికాలో సెప్టెంబర్ వినియోగదారుల ధరల సూచిక (CPI) డేటా ఇంకా విడుదల కాలేదు. ఈ డేటా ఫెడరల్ రిజర్వ్ తదుపరి వడ్డీ రేటు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫెడ్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే అది మళ్ళీ బంగారానికి సానుకూల సంకేతం కావచ్చు.