Hunger Index: కోటి విద్యలు కూటికోసమే అన్నట్లు ఎన్నికోట్లు సంపాదించిన జానెడు పొట్టకు పట్టెడన్నం పెట్టుకోలేకపోతే దానంత దరిద్రం ఇంకోటి ఉండదు. ప్రస్తుతం భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంది అంటూ మురిసిపోతుంటే.. దానికి సమాంతరంగా దేశంలో ఆకలితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. దేశంలో సంపన్నుల సంపద పెరుగుతూనే ఉంది.. పేదవారు పేదవారుగానే మిగిలిపోతున్నారు. పేదవారికి మూడు పూటలా భోజనం అందించగలినప్పుడు ఏ దేశమైనా అభివృద్ధి చెందినట్లు. కొన్ని దేశాలు అభివృద్ధిలో భారత్ కంటే వెనకబడి ఉన్నప్పటికీ పేదవారి ఆకలి తీర్చడంలో మాత్రం అవి మనకంటే ముందు వరుసలో ఉన్నాయి.
Read Also: Andhra Pradesh: రేపు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
ఈ విషయంలో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్నాయి. కానీ ఓ విషయంలో మాత్రం ఈ దేశాలు మన కంటే ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయి, పోషకాహార లోపాలు సూచించే ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం మరింత దిగ జారింది. మొత్తం 121 దేశాలను పరిగణనలోకి తీసుకోగా మన దేశం107వ స్థానంలో నిలిచింది. అయితే ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంక 64, పాకిస్థాన్ 99 స్థానంలో ఉండటం చర్చించుకోదగ్గ విషయం. జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్ హంగర్, వెల్తుంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి. గతేడాది ఇదే సూచీలో భారత్ 101 స్థానంలో ఉంది. అయితే ఈసారి మరింత దిగజారిపోవడం విమర్శలకు కారణమవుతోంది. ఆకలి, పౌష్టికాహార లోపం వంటి అంశాలపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. దేశంలో 22.4 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఆకలి సూచీలో భారత్ దాదాపుగా అట్టడుగు స్థానానికి చేరుకుందని ట్వీట్ చేశారు.
Read Also: T20 World Cup : తొలిపోరులోనే శ్రీలంకపై నమీబియా ఘన విజయం
బ్రెజిల్, చిలీ, చైనా, క్యూబా, కువైట్ సహా 18 దేశాలు జీహెచ్‌ఐ స్కోరు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ వివరాలు ఆకలి, పోషకాహార లోపాలను లెక్కించే జీహెచ్‌ఐ వెబ్‌సైట్ గతేడాది వెల్లడించింది. అయితే.. ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టి పారేసింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ ఈ నివేదికను ఖండించింది. ఈ సూచీ శాస్త్రీయబద్ధంగా జరగలేదనేది కేంద్రం వాదన. కాగా.. అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే తక్కువ ర్యాంకింగ్ ఇచ్చారని ప్రభుత్వం ఆరోపించింది. మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని ఆ జాబితా రూపొందించలేదని కేంద్ర మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.