Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. విశాఖ ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. మూడేళ్ళుగా రాజీనామాను స్పీకర్ కోల్డ్ స్టోర్లో పెట్టేశారని.. తాను రాజీనామా చేసినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి వచ్చి ఉంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అయ్యివుండేదన్నారు.
విలువలు, సంప్రదాయాలను పాటించకుండా దొంగచాటుగా రాజీనామాను ఆమోదించారంటే దాని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. తన రాజీనామా ఆమోదం వైసీపీ ప్రభుత్వానికి చెల్లు చీటీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామాపై న్యాయపోరాటం జరుగుతుందని గంటా శ్రీనివాసరావు వెల్లడిచారు. రాజ్యసభలో ఓటు వేసేందుకు ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. విలువలకు జగన్మోహన్ రెడ్డి సిలువ వేస్తున్నారని.. 50మందికి పైగా ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా వున్నారని ఆయన అన్నారు.