నేరాలు చేసిన వారిని జైలుకు తరలిస్తే.. సత్ప్రవర్తనతో బయటకు వస్తారు. తద్వారా సమాజంలో నేరాలు తగ్గుతాయని చెబుతుంటారు. కానీ చాలా వరకు దానికి భిన్నంగా జరుగుతోంది. నేరాలు చేసి జైలుకు వెళ్లి.. తిరిగి వచ్చేటప్పుడు కొత్త స్నేహాలతో బయటకు వస్తున్నారు. అంతే కాదు.. అక్కడ ఏర్పడిన పరిచయాలతో మళ్లీ నేరాలతో దూసుకుపోతున్నారు క్రిమినల్స్. ఇప్పుడు విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో సరిగ్గా ఇలాగే జరిగింది.
Also Read:Airtel: యూజర్లకు ఎయిర్టెల్ షాక్.. ఆ చౌకైన ప్లాన్ తొలగింపు!
దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఒక నేరం చేసిన వాళ్లు జైలుకు వెళ్లి.. తిరిగి వచ్చేటప్పుడు కొంత మంది స్నేహితులతో జతకడుతున్నారు. బయటకు వచ్చాక పెద్ద నేరాలకే పాల్పడుతున్నారు. ఇదే తరహాలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ డ్రగ్స్ తయారీ సంస్థ ముసుగులో ఆల్ఫాజోలం మత్తు మాత్రలు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్.. DRI అధికారులు. వారు పట్టుకున్న సరుకు విలువ 23.88 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
నిజానికి అక్కడ ఏర్పాటు చేసింది ఓ మెడికల్ డ్రగ్స్ తయారీ సంస్థ. ఎవరెక్స్ డ్రగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. కానీ అందులో మెడికల్ డ్రగ్స్ ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన DRI కి సమాచారం అందింది. దీంతో వారు ఎవరెక్స్ డ్రగ్స్ ప్రయివేట్ లిమిటెడ్‌పై దాడి చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడకు చెందిన అధికారులు బృందంగా ఏర్పడి రెండు రోజులపాటు కంపెనీలో తనిఖీలు చేపట్టారు.
అక్కడ 119 కేజీల ఆల్ఫాజోలం రసాయన మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాత్రల తయారీకి సిద్ధంగా ఉన్న 87 కేజీల సరుకు, 3,600 లీటర్ల ముడి ద్రవం, రెండు రియాక్టర్లు, ఒక సెంట్రిఫ్యూజ్, ఒక డ్రైయర్‌తో పాటు పలు పత్రాలు దొరికాయి. తయారు చేస్తున్న 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మాస్టర్ మైండ్స్, కెమిస్ట్‌లు, ఫైనాన్షియర్లు, కొనుగోలుదారులు అందరూ ఒకేచోట చిక్కారు. వీరిపై మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల ఎన్డీపీఎస్ -1985 చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
Also Read:Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!
ఆల్ఫాజోలం మాత్రలను తెలంగాణలో కల్లుకు వినియోగం
అరెస్టైన వారిలో కొందరు ఇప్పటికే డ్రగ్స్ తయారీ, హత్యలు, ఆర్థిక, సైబర్ నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినవారు ఉన్నారని DRI అధికారులు చెప్పారు. జైల్లో ఉన్నప్పుడే, అధికంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో దీనికి వ్యూహరచన చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక నిషేధిత మాత్రల తయారీకి డ్రగ్ కంపెనీని గుర్తించడంతో పాటు ఫైనాన్షియర్, కొనుగోలుదారులు, తయారీ నిపుణులను ఎంచుకొని, ఈ నేరానికి పాల్పడ్డారు. ఇక్కడ తయారయ్యే ఆల్ఫాజోలం మాత్రలను తెలంగాణలో కల్లులో వినియోగించాలని వీరు ప్రణాళిక రచించారు. తెలంగాణలో కల్తీకల్లు కోసం ఈ ఆల్ఫాజోలం మాత్రలను వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ముఠా ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసిందని చెబుతున్నారు.