Man Steals Ganesh Laddu in Bachupally: పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే ‘వినాయక చవితి’గా హిందూ ప్రజలు జరుపుకుంటారు. గణేశుడి ఉత్సవాల సందర్భంగా లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. అలాంటి లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి కుటుంబంలో సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణేశుడి లడ్డును దొంగతనం చేస్తే ఇంకా మంచి జరుగుతుందని పెద్దలు అంటున్నారు. అందుకే చాలామంది వినాయకుడి చేతిలో ఉండే లడ్డును దొంగిలిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… వినాయక చవితి సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరం బాచుపల్లి పరిధి ప్రగతి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గణేషుడిని పెట్టారు. మొదటిరోజు పూజా కార్యక్రమాల అనంతరం అపార్ట్‌మెంట్ వాసులు లంబోదరుడి చేతిలో భారీ లడ్డూను పెట్టారు. శనివారం రాత్రి 1 గంట సమయంలో అందరూ పడుకున్నారు. మండపంలో ఎవరూ లేరు. ఆ సమయంలో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన ఓ దొంగ.. నెమ్మదిగా మండపంలోకి వచ్చి గణేషుడి చేతిలో ఉన్న లడ్డూను ఎత్తుకెళ్లిపోయాడు.
Also Read: Tamannaah Bhatia: నా జీవితంలో రెండు బ్రేకప్స్.. బాంబ్ పేల్చిన తమన్నా!
అపార్ట్‌మెంట్ వాసులు ఈరోజు ఉదయం మండపానికి వెళ్లి చూడగా.. గణేషుడి చేతిలో లడ్డూ లేదు. ఒక్కసారిగా షాక్ అయిన వారు.. సీసీ కెమెరాలను పరిశీలించగా లడ్డూ చోరీకి గురైందని తెలిసింది. దొంగ లడ్డూను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి భిన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘లక్కీ బాయ్’ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ‘ఓర్నీ నీ దుంపతెగ.. ఇవేం పనులురా అయ్యా’ అని మరికొందరు అంటున్నారు.