Gaddar Last Rites: అమ్మా తెలంగాణమా అంటూ అణువనువును తట్టిలేపిన ఆ స్వరం ఇక సెలవు తీసుకుంది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ.. తెలంగాణ గోసకు పతాకమైన నిలిచి ఆ గానం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన మాట, పాట, ఆటలతో.. మాటలనే పాటలుగా మలిచి ఉర్రూతలూగించిన ప్రజా యుద్ధనౌక ప్రస్థానం ముగిసిపోయింది. బండెనక బండి కట్టి తరలొచ్చిన ప్రజాగాయకుడి అభిమానలోకం.. వాలిపొతున్న పొద్దుకు విప్లవజోహార్లంటూ కన్నీటి వీడ్కోలు పలికింది. సికింద్రాబాద్ అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయంలో బౌద్ధమత ఆచారం ప్రకారం ప్రజాయుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. కడసారి చూపుకోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. గద్దర్‌కు అత్యంత ఇష్టమైన మహాబోధి పాఠశాలలోనే అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో అభిమానులు, మంత్రులు, పలు పార్టీల నాయకులు, కళాకారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read: Gaddar: గద్దర్ రేర్ ఫొటోలు
ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో అభిమానులు, కళాకారులు పాల్గొన్నారు. అల్వాల్‌లోని గద్దర్ ఇంటి వద్ద పార్ధివదేహాన్ని కాసేపు ఉంచి అనంతరం అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయానికి తరలించారు. అల్వాల్‌లో గద్దర్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ అంతిమయాత్రలో పాటనే ఆయన ఆయుధంగా చేసుకుని సమాజంలోని అసమానతలపై పోరాడిన విప్లవగాయకుల్లో అగ్రగణ్యునిగా నిల్చిన ప్రజాగాయకుడినకి అభిమాన లోకం విప్లవ జోహార్లు పలికింది. గజ్జెకట్టి ఆడి, పాడి జనాన్ని ఉర్రూతలూగిస్తూ 5 దశాబ్దాలుగా ప్రతి తెలుగు ఇంటికి సుపరిచితమైన ప్రజాయుద్ధనౌక గద్దర్ కడసారి చూపు కోసం వేలాదిగా జనం సందోహం తరలివచ్చింది. అభిమానలోకం జోహార్ గద్దరన్న అంటూ వీడ్కోలు పలికింది.
Also Read: Gaddar: ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపొద్దు: ఏటీఎఫ్