బ్రిస్బేన్‌లోని ప్రతిష్టాత్మక గబ్బా క్రికెట్ స్టేడియం శిథిలావస్థకు చేరుకుందని క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. 2032 ఒలింపిక్స్ అనంతరం గబ్బా స్టేడియాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం విక్టోరియా పార్క్ ప్రాంతంలో 63 వేల సామర్థ్యమున్న కొత్త స్టేడియంను నిర్మిస్తామని ప్రకటించిది. ఒలింపిక్స్ అనంతరం ఈ స్టేడియానికి క్రికెట్ తరలి వెళ్లనుంది. ఈ విషయాన్ని క్వీన్స్‌ల్యాండ్ ప్రిమియర్ డేవిడ్ క్రిసాఫుల్లి తాజాగా ప్రకటించాడు.
2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వానికి గబ్బా స్టేడియం పెద్ద తలనొప్పిగా మారింది. శిథిలావస్థకు చేరుకున్న గబ్బా స్టేడియానికి ముందుగా పునరుద్ధరణ చేయాలనుకున్నారు. అయితే ఖర్చు పెరుగుతుండటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఎన్నో చర్చల తర్వాత విక్టోరియా పార్క్‌లో కొత్త స్టేడియంను నిర్మించాలని నిర్ణయించారు. అధునాతన సౌకర్యాలతో 63,000 సామర్థ్యమున్న స్టేడియంను నిర్మించనున్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా ప్రముఖ స్టేడియాన్ని ఆవిష్కరించడానికి క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. గబ్బా శిథిలావస్థలో ఉంది. స్టేడియం నిర్వహణ సరిగా లేదు. 2032 ఒలింపిక్స్ నిర్వహణకు మంచి స్టేడియం కావాలి. వారసత్వాన్ని అందించలేని తాత్కాలిక సౌకర్యాలు, స్టాండ్‌ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయలేం. కొత్త స్టేడియాన్ని నిర్మించాలని నిర్ణయించాం’ అని క్వీన్స్‌ల్యాండ్ ప్రిమియర్ డేవిడ్ క్రిసాఫుల్లి ఒలింపిక్స్ తాజా ప్రణాళికల్ని తెలిపారు. కొత్త స్టేడియాన్ని నిర్మించాక ప్రతిష్టాత్మక గబ్బా క్రికెట్ స్టేడియంను కూల్చివేయనున్నారు.