G20 Summit Dispute: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం దౌత్యపరమైన వివాదంతో ముగిసింది. అమెరికా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించి, తన రాయబార కార్యాలయం నుంచి ఒకే ఒక దౌత్యవేత్తను శిఖరాగ్ర సమావేశానికి పంపింది. ఈక్రమంలో దక్షిణాఫ్రికా G20 అధ్యక్ష పదవిని అమెరికా ప్రతినిధికి అప్పగించడానికి నిరాకరించి, సమావేశానికి అమెరికా పంపించిన ప్రతినిధి తక్కువ స్థాయి వ్యక్తి అని అభివర్ణించింది. ప్రతి శిఖరాగ్ర సమావేశం ముగింపులో అధ్యక్ష పదవిని తదుపరి దేశానికి అప్పగిస్తారు. 2026లో అమెరికా G20 అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది.
READ ALSO: YS Jagan : పంట ధరలు రికార్డు స్థాయిలో పతనమైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
అమెరికా తన రాయబార కార్యాలయం నుంచి పౌర దౌత్యవేత్తను మాత్రమే పంపడం అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను అవమానించడమేనని దక్షిణాఫ్రికా చెబుతోంది. వాస్తవానికి దక్షిణాఫ్రికా వర్ణవివక్ష, శ్వేతజాతి వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, దాని ఆఫ్రికనేర్ శ్వేతజాతి మైనారిటీని అణచివేస్తుందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే.
అధికారిక బదిలీ ఎప్పుడు జరుగుతుంది..
దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా మాట్లాడుతూ.. అమెరికా G20లో సభ్యదేశమని అన్నారు. అది ప్రాతినిధ్యం వహించాలనుకుంటే, తగిన స్థాయి అధికారిని పంపాలి. ఈ శిఖరాగ్ర సమావేశం నాయకుల కోసమేనని ఆయన వివరించారు. అందువల్ల ఈ సమావేశంలో ఒక దేశం తరుఫున పాల్గొన్న ప్రతినిధి దేశ అధ్యక్షుడిగా లేదా అధ్యక్షుడు నియమించిన ప్రత్యేక రాయబారిగా ఉండాలి. అది కనీసం మంత్రి స్థాయి అయినా ఉండాలి. కానీ ఈ సమావేశంలో అమెరికా తరుఫున పాల్గొన్న ప్రతినిధి ఆ స్థాయి వ్యక్తి కాదు. దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి జీ-20 అధ్యక్ష పదవిని అమెరికాకు అధికారికంగా బదిలీ చేయడం తరువాత జరుగుతుందని, బహుశా దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇంతలో అమెరికా – దక్షిణాఫ్రికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చివరి నిమిషంలో అమెరికా తన మనసు మార్చుకుందని, శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలనే కోరికను వ్యక్తం చేసిందని రామఫోసా పేర్కొన్నారు. కానీ వైట్ హౌస్ దానిని తిరస్కరించింది. రామఫోసా అమెరికా, అధ్యక్షుడికి వ్యతిరేకంగా అతిగా మాట్లాడుతున్నారని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో దక్షిణాఫ్రికా మరో ప్రత్యేకమైన అడుగు వేసింది. సాధారణంగా నాయకుల ప్రకటనను శిఖరాగ్ర సమావేశం ముగింపులో జారీ చేస్తారు. అయితే దక్షిణాఫ్రికా దానిని మొదటి రోజే జారీ చేసింది. దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది.
READ ALSO: Delhi Drug Seizes: ఢిల్లీలో రూ.200 కోట్ల డ్రగ్స్ సీజ్..