Delhi Drug Seizes: దేశ రాజధాని ఢిల్లీలో రూ.200 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను ఒక ప్రధాన ఆపరేషన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్ ఒక ఫామ్‌హౌస్‌పై దాడితో ప్రారంభమైందని, అక్కడ లభించిన కీలకమైన ఆధారాల ఆధారంగా, NCB మూడు రోజుల ఆపరేషన్ నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఒక ప్రధాన అంతర్జాతీయ సింథటిక్ డ్రగ్ నెట్‌వర్క్‌ను గుర్తించిందని వెల్లడించారు. దర్యాప్తులో ఈ ముఠా మొత్తం విదేశీయుల ఆధ్వర్యంలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఫామ్‌హౌస్ దాడి తర్వాత ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లోని అనేక ప్రదేశాలలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు, అలాగే అనుమానితుల కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు.
READ ALSO: JBL Tune 760NC: రూ. 8000 విలువైన JBL హెడ్‌ఫోన్స్ రూ. 1999కే.. 50 గంటల బ్యాటరీ లైఫ్ తో..
ఈ ఆపరేషన్‌లో NCB ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని మంగ్రౌలి గ్రామానికి చెందిన 25 ఏళ్ల షేన్ వారిస్‌ను అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో ఆయన హరోలాలోని నోయిడా సెక్టార్ 5లో అద్దెకు నివసిస్తున్నాడు. ఆయన అక్కడ ఒక కంపెనీకి సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. తన “బాస్” సూచనల మేరకు షేన్ నకిలీ సిమ్ కార్డులు, వాట్సాప్, జాంగి వంటి రహస్య చాట్ యాప్‌లను ఉపయోగించి తన స్థానాన్ని, కార్యకలాపాలను గుర్తించకుండా ఉండేవాడని దర్యాప్తులో వెల్లడైంది. NCB అధికారులు షేన్‌ను నవంబర్ 20న అరెస్టు చేశారు. విచారణలో అతను మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లో తన పాత్రను అంగీకరించి, అనేక కీలకమైన వివరాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో నిందితుడు ఎస్తేర్ కిమాని అనే మహిళ పేరును వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆమెకు పోర్టర్ రైడర్ ద్వారా పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను పంపాడని, దర్యాప్తులో ఆమె చిరునామా, సంప్రదింపు సమాచారాన్ని ఇచ్చినట్లు NCB అధికారులు వెల్లడించారు.
షేన్ అందించిన సమాచారం మేరకు.. నవంబర్ 20న ఛత్తర్‌పూర్ ఎన్‌క్లేవ్ ఫేజ్ 2లోని ఒక ఇంటిపై NCB తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో ఆ ఇంటి నుంచి 328.54 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇటీవలి సంవత్సరాలలో సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటిగా దర్యాప్తు ఏజెన్సీ చెబుతుంది. డ్రగ్స్ దొరికిన ఫ్లాట్‌లో నాగాలాండ్‌కు చెందిన ఎస్తేర్ కినిమి అనే మహిళ ఉందని, ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మొత్తం నెట్‌వర్క్‌లోని ఇతర లింక్‌లపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.