Violence in Manipur: ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లకు కారణంగా మారింది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇరువర్గాలకు మద్దతుగా మిలిటెంట్లు కూడా రంగప్రవేశం చేసి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా పదివేలకు పైగా ఆర్మీ, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మణిపూర్ లో పహారా కాస్తున్నారు. కాంగ్‌పోక్పిలో మరొక వ్యక్తి మరణించిన తరువాత గుమిగూడిన గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గురువారం సాయంత్రం టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. మృతుడి మృతదేహాన్ని రాష్ట్ర రాజధానికి తీసుకురావడంతో ఇంఫాల్‌లో ఉద్రిక్తత నెలకొంది. కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఆగ్రహించిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది.
కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన కాల్పుల్లో అంతకుముందు రోజు మరణించిన మాజీ మర్చంట్ నేవీ అధికారికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు జనం గుమిగూడారు. సాంప్రదాయ శవపేటికలో ఉంచిన వ్యక్తి మృతదేహాన్ని ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబండ్ బజార్‌కు తీసుకువచ్చారు. అధికారుల ప్రకారం, మహిళల నేతృత్వంలో, ప్రదర్శనకారులు శవపేటికను ఊరేగింపుగా ముఖ్యమంత్రి బీరెన్ ఎన్ సింగ్ నివాసానికి తీసుకువెళతామని బెదిరించారు. పోలీసులు వారిని అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు రోడ్డు మధ్యలో టైర్లను తగులబెట్టారు. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, జనాన్ని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో మృతదేహాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని మార్చురీకి తరలించారు. ఈ హింసాకాండలో బీజేపీ కార్యాలయంపై కూడా దాడి జరిగింది.
Also Read: Delhi University: మోడీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు.. నల్లరంగు దుస్తులు ధరించవద్దని ఆదేశాలు
ఇదిలా ఉంటే మణిపూర్‌లోని హరోథెల్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో గురువారం ఉదయం సాయుధ అల్లరిమూకలు కాల్పులు జరిపాయని సైన్యం తెలిపింది. భద్రతా బలగాలు కూడా కాల్పులకు స్పందించాయి. ‘‘కాలిబ్రేట్ పద్దతి’’లో స్పందించినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. బలగాలు కాల్పులను ఆపేగలిగాయని.. అయితే దీంట్లో కొంత ప్రాణనష్టం కనిపిస్తోందని పేర్కొంది. ఆర్మీ ప్రకటన ప్రకారం, గురువారం ఉదయం 5:30 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రతిస్పందనగా సైన్యం ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపు తీసుకువచ్చేందుకు అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని లీమఖోంగ్ వద్ద గురువారం జరిగిన తాజా హింసాకాండలో ఒక మహిళ మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. అధునాతన ఆయుధాలతో సాయుధ మిలిటెంట్లు కాంగ్‌పోక్పి జిల్లాలోని పలు గ్రామాలపై దాడి చేసి కాల్పులు జరిపారని, ప్రజలపై దాడి చేశారని ఇంఫాల్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మిలిటెంట్ల కాల్పుల్లో లీమఖోంగ్ గ్రామంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మణిపూర్ పోలీసులతో కలిసి పారామిలిటరీ సిబ్బంది.. మిలిటెంట్లు దాడి చేసిన గ్రామాలకు చేరుకుని ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
మణిపూర్ రాష్ట్రంలో మెజారిటీ మెయిటీ వర్గానికి ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ.. కుకీ, నాగా ఇతర వర్గాలు మే 3న తీవ్ర నిరసన తెలిపాయి. ఆ సమయంలో హింస చెలరేగింది. ఇది రెండు వర్గాల మధ్య హింసకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో మైయిటీలు 53 శాతం ఉన్నారు. వీరు కేవలం 10 శాతం ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో నివసిస్తున్నారు. 40 శాతం ఉన్న కుకీ, నాగా వంటి గిరిజనులు మిగతా 90 శాతం ప్రాంతంలో ఉన్నారు. అయితే మైయిటీలు ఎస్టీలు కాకపోవడంతో కొండ ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేకపోయింది. తమ జనాభా విస్తరణ కోసం గత కొంతకాలంగా వారు ఎస్టీ హోదాను కోరుతున్నారు. మిగతా తెగలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు మణిపూర్ ఘర్షణల్లో 100కు పైగా మంది చనిపోయారు.