Pakistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మంగళవారం పాక్ దళాలు, ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 15 మంది సాధారణ పౌరులు చనిపోయినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు చెప్పారు. ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైనిక పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు, పాకిస్తాన్ తాము జరిపిన దాడుల్లో 200కు పైగా తాలిబాన్లు హతమైనట్లు చెబుతున్నారు, పాక్ సైనికులు 28 మంది మరణించినట్లు వెల్లడించారు. అంతకుముందు జరిగిన దాడుల్లో 50కి పైగా పాక్ సైనికులు చనిపోయినట్లు తాలిబాన్లు ప్రకటించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయారు.. చంద్రబాబుకు భయం పట్టుకుంది..!
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేకపోవడంతో, పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, సౌదీ అరేబియాలకు పాకిస్తాన్ ఫోన్ చేసింది. ‘‘దేవుడి దయకోసం, ఆఫ్ఘన్లు పోరాడకుండా ఆపండి’’ అని పాకిస్తాన్ అధికారులు ఇతర దేశాలను బ్రతిమిలాడుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్, సౌదీతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
గత వారం, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటన వచ్చిన సమయంలో, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులు చేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తెహ్రీక్ ఇ తాలిబాన్(టీటీపీ)ని తాము టార్గెట్ చేస్తున్నామని పాకిస్తాన్ చెబుతోంది. అయితే, ఆదివారం సౌదీ, ఖతార్‌ల విజ్ఞప్తుల తర్వాత ఇరు దేశాల మధ్య స్వల్ప విరామం తర్వాత మంగళవారం నుంచి మళ్లీ కాల్పులు మొదలయ్యాయి.
