Canada Cabinet: కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ తన 28 మంది సభ్యుల మంత్రివర్గంలో నలుగురు భారతీయ మూలాల ఎంపీలకు చోటు కల్పించారు. ఈ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ నియమితులవడంతో భారతీయ సభ్యులలో ఆనందం కలిగించింది. మార్చిలో జస్టిన్ ట్రూడో నుండి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కార్నీ, ఏప్రిల్ 28న జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీకి విజయం సాధించారు.
Read Also: Bulldozers Rolled: ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. 280 పైగా అక్రమ నిర్మాణాల తొలగింపు.!
కార్నీ ప్రజల మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని తన మంత్రివర్గాన్ని ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో భాగంగా హిందూ మతానికి చెందిన తొలి మహిళగా కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైన అనితా ఆనంద్, భగవద్గీతపై చేతి ఉంచి ప్రమాణం చేశారు. గత మంత్రివర్గంలో ఆమె ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మెలనీ జోలీ స్థానంలో ఆమెకు ఈ కీలక బాధ్యత అప్పగించారు.
అలాగే బ్రాంప్టన్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే మనిందర్ సిద్ధూ, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా ప్రమాణం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ బెదిరింపుల మధ్య, ఈ పదవి కెనడాకు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. పంజాబ్‌లో జన్మించిన సిద్ధూ చిన్నతనంలోనే కెనడాకు వలస వచ్చి బ్రాంప్టన్‌లో పెరిగారు. టొరంటో విశ్వవిద్యాలయంలో బిజినెస్ డిగ్రీ పొందిన ఆయన, రియల్ ఎస్టేట్ అండ్ కమ్యూనిటీ సేవలలో అనుభవం ఉన్నవారు.
Read Also: Assam Rifles operation: సైన్యం భారీ ఆపరేషన్.. మణిపూర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతం..
బ్రాంప్టన్ నార్త్ నియోజకవర్గానికి 2015 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రూబీ సహోటా.. ఇప్పుడు, క్రైమ్ నివారణ వ్యవహారాల సెక్రటరీగా నియమితులయ్యారు. పంజాబీ వలసదారుల కుమార్తె అయిన రూబీ, యూత్ ఎన్గేజ్మెంట్, ప్రజా భద్రత రంగాల్లో అనుభవం కలిగినవారు. ఆమె గతంలో ప్రొసీజర్ అండ్ హౌస్ అఫైర్స్ కమిటీకి చైర్‌గా పని చేశారు. వీరితో పాటు బ్రిటిష్ కొలంబియాలో జన్మించి పెరిగిన రణదీప్ సారాయ్, సుర్రీ సెంటర్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం నాల్గవసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఆయన అంతర్జాతీయ అభివృద్ధి వ్యవహారాల సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. వలసలు, రియల్ ఎస్టేట్ న్యాయవాదిగా మంచి అనుభవం ఉన్న ఆయన, మానవతా సహాయం, విద్యా, ఆరోగ్య రంగాల్లో కెనడా విదేశీ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.
ఇకపోతే, ఈసారి జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో మార్క్ కార్నీ నాయకత్వంలోని లిబరల్ పార్టీ అండ్ పియర్ పొయిలీవర్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ తరఫున మొత్తం 22 మంది భారతీయ మూలాల అభ్యర్థులు విజయం సాధించి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గత పార్లమెంటులో 17 మంది మాత్రమే ఉన్నారు.