రష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మరణించారు. ఒకరు రక్షించబడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. రష్యాలోని వెలికి నొవ్‌గోరోడ్‌లో నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. నది నుంచి ఐదో విద్యార్థిని క్షేమంగా రక్షించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని తెలిపారు.
ఇది కూడా చదవండి: Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
ప్రమాదానికి గురైన ఐదుగురు విద్యార్థులు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినవారని భారత కాన్సులేట్ అధికారులు తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్సులేట్ విశ్వవిద్యాలయం, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అలాగే సాధ్యమైన సహాయాన్ని అందిస్తామని ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు నది నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లోని కుటుంబాలతోను, జిల్లా యంత్రాంగంతో కాన్సులేట్ సంప్రదింపులు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Modi: దేశానికి సేవ చేసేందుకే మళ్లీ ప్రజలు ఆశీర్వదించారు
