Venkaiah Naidu: ఓరుగల్లుకు ఓ చరిత్ర ఉందని, విజ్ఞాన ఖనిగా ఓరుగల్లుకి పేరుందని.. ఆ పేరు నిలబెట్టాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇష్టమైన పనిలో కష్టపడితే నష్టం లేదన్నారు. టెక్నాలజీలో భారత్ ముందుకు వెళ్తుందన్న వెంకయ్య.. రాబోయే రోజుల్లో 4వ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుందన్నారు. చదువంటే నేర్చుకోవడం కాదు… ఇతరులకు నేర్పడమని ఆయన తెలిపారు.
యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. సంపద పెంచాలని, ఇతరులకు పంచాలని ఆయన అన్నారు. మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నాం.. దాని వల్ల వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రకృతిని ప్రేమించడం నేటి యువత నేర్చుకోవాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం మన సంప్రదాయాలను మనకు గుర్తు తెస్తుందన్నారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని వెంకయ్య పేర్కొన్నారు. ఇంగ్లీష్ భాష నేర్చుకోండి, ఇంగ్లీష్ సంస్కృతిని కాదన్నారు. మాతృభాష కళ్ళ లాంటిది.. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాల లాంటిదన్నారు. మమ్మి డాడీ సంస్కృతి మనకవసరమా అంటూ యువతకు సందేశమిచ్చారు. కొంతమంది వ్యక్తులు కులాలు, మతాల పేరుతో మనల్ని వేరు చేయాలని చూస్తున్నారన్నారు.
Read Also: Kishan Reddy: కుటుంబ పార్టీల కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోంది
ఎడ్యుకేషన్ ఒక మిషన్.. కమీషన్ కాకూడదన్నారు. క్లాస్ రూమ్ వరకే చదువు పరిమితం కాకూడదన్నారు. బాడీ బిల్డింగ్ మాత్రమే కాదు నేషన్ బిల్డింగ్ కూడా చేయాలన్నారు. ఫాస్ట్ ఫుడ్‌ను పక్కన పెట్టి మిల్లెట్స్ తినడం నేర్చుకోవాలని సూచించారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చన్నారు. రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయని, ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తి వంతమైందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.