ఈ రోజుల్లో ‘మొబైల్’ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏది కావాలన్నా అరచేతిలోనే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌లు ట్రెండ్‌గా మారాయి. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ఇవి టాబ్లెట్‌ల మాదిరిగా ఉపయోగపడగలవు. ఫోల్డబుల్ స్క్రీన్‌లను మనం మూయడం లేదా లేదా తెరవడం చేస్తుంటాం. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఈ ఫోన్‌లను భారీ ధర పెట్టి కొనడానికి సరైనవేనా అని?. ఫోల్డబుల్ ఫోన్‌లలో అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్‌లే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.
ఫోల్డబుల్ ఫోన్‌ల యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఫోన్, టాబ్లెట్‌గా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. తెరిచినప్పుడు పెద్ద స్క్రీన్ ద్వారా వీడియోలను చూడటం, గేమ్స్ ఆడటం లేదా మల్టీ టాస్క్ చేయడం సులభం అవుతుంది. మూసివేసినప్పుడు మీ జేబులో ఈజీగా పెట్టుకోవచ్చు. ఫోల్డబుల్ ఫోన్‌లు రెండు లేదా మూడు యాప్‌లను ఒకేసారి రన్ చేయడానికి మద్దతు ఇస్తాయి. ఒక వైపు యూట్యూబ్.. మరోవైపు వాట్సాప్ చూసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ చేసుకోవాలనుకునే ఫోల్డబుల్ ఫోన్‌లు ఉపయోగకరం.
ఫోల్డబుల్ ఫోన్‌లు ప్రీమియం డిజైన్, అధునాతన సాంకేతికతతో వస్తాయి. ఇవి స్టైలిష్‌గా ఉండడమే కాకుండా.. చాలా అప్ డేట్స్ ఉంటాయి. బెస్ట్ డిస్‌ప్లేలు, కెమెరాలు, పనితీరును కలిగి ఉంటాయి. ఇవి హై-ఎండ్ వినియోగదారులకు సరైనవి అనే చెప్పాలి.కానీ దీనివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. ఫోల్డబుల్ ఫోన్ కొనడానికి ముందు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ఫోన్‌లు కొత్త టెక్నాలజీని కలిగి ఉన్నా.. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే 2-3 రెట్లు ఎక్కువ ఖరీదైనవి. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రూ.20,000–30,000కి అందుబాటులో ఉండగా.. ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.90,000 నుండి రూ.1.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి.
Also Read: Ravindra Jadeja: చెన్నైని వీడుతున్నాడనే ఊహాగానాల వేళ.. జడేజా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అదృశ్యం!
ఫోల్డబుల్ ఫోన్‌ల స్క్రీన్‌లు, హింజ్‌లు చాలా సున్నితంగా ఉంటాయి. పదే పదే మడతపెట్టడం వల్ల హింజ్ వదులవుతుంది. ఒక్కోసారి స్క్రీన్‌పై లైన్లు కూడా కనిపిస్తాయి. ఫోన్ పడిపోయినా లేదా ఒత్తిడికి గురైనా.. స్క్రీన్ విరిగిపోయే అవకాశం ఉంది. దుమ్ము లేదా నీరు కూడా ప్రభావం చూపుతుంది. ఫోల్డబుల్ ఫోన్‌లు అధిక-రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేలను కలిగి ఉండటం వలన బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా పోతుంది. యాప్‌లు పూర్తిగా ఆప్టిమైజ్ చేయబడవు. స్క్రీన్ పగిలిపోతే లేదా హింజ్ విఫలమైతే.. రిపేర్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్యానెల్‌ను మార్చాల్సి వస్తే.. రూ.30,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చవుతుంది. సర్వీస్ సెంటర్లు కూడా ఎక్కువగా అందుబాటులో ఉండవు. ఫోల్డబుల్ ఫోన్లు ఆకర్షణీయంగా, సాంకేతికంగా అద్భుతం కానీ.. మన్నిక, ధర, రిపేర్ ఖర్చులు సాధారణ వినియోగదారులకు పెను భారం అనే చెప్పాలి.