రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి ఆనసూయ సీతక్క మంగళవారం నాడు ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిధిలావస్తకు చేరుకుంది. అటవి ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయినర్ పాఠశాల ఏర్పాటుకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయ్ మండలంలో కంటెయినర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క అందుబాటులోకి తేవడంతో స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. అదే కోవలో ఇప్పుడు కంటేయినర్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు టీచర్లు పనిచేస్తుండగా..వారితో పాటు విద్యార్ధులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా కంటేయినర్ పాఠశాలను అందుబాటులోకి తెచ్చారు.
అటవీ ప్రాంతంతో నిబంధనలు సడలించాలి- సీతక్క
స్థానిక ప్రజల అభివృద్ది కోసం అటవీ నిబంధనలు సరళతరం చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఏజేన్సీ ఆవాస గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మౌళిక సదుపాయలను కల్పించేందుకు అనుగుణంగా అటవీ చట్టంలో మార్పులు చేయాలని కోరారు. తాగు నీటి కి అవసరమైన పైపులు, విద్యుత్ లైన్లు, రహదారులు, ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అటవీ నిబంధనలు ఆటకంగా మారాయని పేర్కొన్నారు. మైనింగ్, ఇతర కార్యకలాపాల కోసం నిబంధనలను సరళతరం చేస్తున్న కేంద్రం…ప్రజల అభివృద్ది కోసం నిబంధనలను సడలించకపోవడం శోచనీయమన్నారు. అటవి ప్రాంతాల్లో ఉన్న ఎస్టీ ఆవాసాలకు తాగు నీటిని సరఫరా చేసేందుకు సోలార్ విద్యుత్ ను వినియోగించాల్సి వస్తుందన్నారు. కనీసం విద్యా, వైద్య సేవలు ఆదివాసీలకు అందేలా అటవీ చట్టంలో తగిన మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు మంత్రి సీతక్క.